ఆర్యన్ ఖాన్‌కు బెయిల్‌...పట్టుకొన్నవాడి మెడకు కేసు

October 29, 2021


img

మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ బాదుషా షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ నేడో రేపో బెయిల్‌పై విడుదల కాబోతుండగా, అతనితో సహా మరికొందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపిన ఎన్‌సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడటం విశేషం. 

ఆర్యన్ ఖాన్‌ను ఈ కేసు నుంచి తప్పించాలంటే రూ.8 కోట్లు ఇవ్వాలని సమీర్ వాంఖడే డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ వ్యవహారంపై ఎన్‌సీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. మహారాష్ట్ర పోలీసులు ఏ క్షణాన్నైనా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన వాంఖడే గురువారం బాంబే హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయవలసిందిగా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. 

ఈ కేసులో ఓ రాజకీయ కోణం కూడా ఉంది. మహారాష్ట్రలోని అధికార శివసేనకు, ఒకప్పడు దానితో కలిసి పనిచేసిన బిజెపికి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ కేసులో శివసేన ఆర్యన్ ఖాన్‌కు మద్దతుగా మాట్లాడుతుండటంతో సహజంగానే బిజెపి దానికి వ్యతిరేకంగా వాదిస్తోంది. ఈ కేసును అడ్డుపెట్టుకొని బిజెపి, శివసేనల మద్య మళ్ళీ ఆధిపత్యపోరు మొదలైంది. 

ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి వాంఖడేను విచారించేందుకు ఏసీబీ పోలీసులతో కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. అందుకే వాంఖడే హైకోర్టులో పిటిషన్‌లో వేయాల్సి వచ్చింది.


Related Post