అప్పుడు ధర లేదు...ఇప్పుడు పత్తి లేదు

October 28, 2021


img

దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకొన్నాడనే నానుడిని తిరగ వ్రాసి ‘పూజారి ఆశీర్వదించినా...దేవుడు శపించాడనుకోవలసివస్తోంది రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి చూస్తే! ఏటా భారీగా పత్తి పండించి మార్కెట్టుకి తీసుకువస్తే గిట్టుబాటు ధర రాక పత్తి రైతులు నష్టపోతుంటారు. అయితే ఈసారి పత్తి ధర అనూహ్యంగా పెరిగి క్వింటాలుకి రూ. 8,000 పైనే పలుకుతోంది. త్వరలో రూ.10 వేలకు చేరవచ్చునని భావిస్తున్నారు. కనుక ఈసారి పత్తి రైతులకు భారీగా లాభాలు వస్తాయనుకొంటే, ఇప్పుడు అమ్ముకోవడానికి రైతుల వద్ద తగినంత పత్తి లేదు! గత నెల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో పత్తి పంట అంతా నాశనం అయిపోవడమే ఇందుకు కారణం. 

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 46.42 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారు. అంతా సవ్యంగా సాగితే సాధారణంగా ఎకరానికి 10-15 క్వింటాళ్ళ పత్తి దిగుబడి రావాల్సి ఉండగా ఈ అకాల వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో పూర్తిగా పంట నష్టపోగా  కొన్ని ప్రాంతాలలో ఏకరాకు కేవలం 3-4 క్వింటాళ్ళు మాత్రమే రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దానినైనా అమ్ముకొందామంటే పంట పెట్టుబడి, పురుగుల మందులు, కూలీల ఖర్చులే ఎకరానికి రూ.20-22 వేలు వరకు అవుతున్నాయి. ఈసారి మార్కెట్‌లో పత్తి ధరలు పెరిగాయి కనుక రైతుకు ఎకరానికి రూ.10 వేల లోపూ మిగులుతోంది లేకుంటే పొలంలోనే పత్తిని తగులబెట్టవలసి వచ్చేది. 

లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి సాగుచేస్తే అకాల వర్షాలు పత్తి రైతులను నిలువునా ముంచేశాయి. ఇటువంటి సమయంలో మార్కెట్లో రోజురోజుకీ పెరుగుతున్న పత్తి ధరలను సంతోషించాలో లేదా ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోలేని తమ నిసహాయతకు బాధ పడాలో తెలీని పరిస్థితులలో పత్తి రైతులున్నారు. అందుకే దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకొన్నాడనే నానుడిని తిరగ వ్రాసి చదువుకోవాల్సివస్తోంది.


Related Post