వాసాలమర్రిలో దళిత బంధు పంపిణీ...భలే టైమింగ్

October 28, 2021


img

యాదాద్రి భువనగిరి జిల్లాలోని సిఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో బుదవారం పదిమంది దళిత బంధు పధకం లబ్దిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి ట్రాక్టర్లు, గూడ్స్ వెహికల్స్, ఆటో రిక్షాలు అందజేశారు. మామూలు రోజుల్లో అయితే ఈ వార్తకు అంత ప్రాధాన్యం ఉండకపోవచ్చు కానీ మరో రెండు రోజుల్లో హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరుగబోతున్నందున దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముందు టిఆర్ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా దళిత బంధు పధకాన్ని ప్రకటించి, వాసాలమర్రి గ్రామంలో 76 దళిత కుటుంబాలకు పదేసి లక్షలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాలలో జమా చేసింది. హుజూరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి రాకమునుపే అక్కడ కూడా ఈ పధకాన్ని ప్రకటించి అమలుచేసేందుకు సిద్దపడింది. అయితే దళిత బంధు పధకం హుజూరాబాద్‌ ఓటర్లను ప్రభావితం చేస్తుంది కనుక ఉపఎన్నిక ఫలితం వెలువడే వరకు ఈసీ స్టే విధించింది. 

అయితే వాసాలమర్రిలో దళిత బంధు పధకం అమలుపై ఎటువంటి నిషేదమూ లేదు కనుక టిఆర్ఎస్‌ చాలా తెలివిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు వాసాలమర్రిలో ఈ పధకం ద్వారా లబ్దిదారులకు వాహనాలు అందజేసి ఈ విషయం హుజూరాబాద్‌ ఓటర్లకు తెలిసేలా చేసింది. తద్వారా ఉపఎన్నిక తరువాత హుజూరాబాద్‌లో లబ్దిదారులకు కూడా తప్పకుండా ఈ పధకం అందుతుందనే నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించినట్లు భావించవచ్చు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నిక తమ పార్టీకి చాలా చిన్న విషయమని పదేపదే చెపుతూనే మరో పక్క టిఆర్ఎస్‌ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండటం గమనిస్తే ఈ ఉపఎన్నికకు ఆ పార్టీకి ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్ధం చేసుకోవచ్చు. 



Related Post