అతని తొందరపాటుతో తల్లితండ్రులకు తీరని శోకం

October 27, 2021


img

హైదరాబాద్‌లో కిషన్‌బాగ్‌లోని నందిముస్లైగూడాకు చెందిన పవన్ కుమార్‌ (17) ఆత్మహత్య చేసుకొని తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చివెళ్ళిపోయాడు. 

బహదూర్‌పురా పోలీసులు తెలిపినదాని ప్రకారం... పవన్ కుమార్‌ పదో తరగతి పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మృతదేహం వద్ద లభించిన ఓ సూసైడ్ నోట్‌లో అతను, తనకు వారం రోజుల క్రితం గుండెనొప్పి వచ్చిందని కానీ ఆ విషయం చెపితే అందరూ కంగారూ పడతారని చెప్పలేదని వ్రాశాడు. తల్లితండ్రులను విడిచివెళ్ళిపోతున్నందుకు తనను క్షమించమని, అందరూ తనను మరిచిపోయి సంతోషంగా ఉండాలని ఆ లేఖలో కోరాడు. అక్కను ఎవరైనా వేధిస్తే పెద్దన్నకు చెప్పాలని లేఖలో వ్రాశాడు. తన సెల్ ఫోన్‌ అమ్మేసి ఆ డబ్బుతో తన అంత్యక్రియలు చేయాలని, అప్పుడే తన ఆత్మకు శాంతి కలుగుతుందని పవన్ కుమార్‌ సూసైడ్ నోట్‌లో వ్రాశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది చదివితే తెలిసీ తెలియని వయసులో అపరిపక్వత, తొందరపాటుతో ఆత్మహత్య చేసుకొన్నట్లు అర్ధమవుతూనే ఉంది. గుండెపోటు వచ్చిందని ఆ బాలుడు వ్రాశాడు. అంతా చిన్న వయసులో అతనికి గుండె పోటు వచ్చిందంటే నమ్మశక్యంగా లేదు. అది అజీర్తివలన ఛాతిలో కలిగిన నొప్పి కావచ్చు. ఒకవేళ నిజంగానే గుండె పోటు వచ్చినా దాంతో చనిపోకుండా బ్రతికి బయటపడినందుకు అతను సంతోషించాలి. వెంటనే తల్లితండ్రులకు చెప్పి ఉంటే వారు వైద్యం చేయించి ఉండేవారు. కానీ వారు బాధపడతారని భావిస్తూ తాను కుమిలిపోయి ఆత్మహత్య చేసుకొని వారికి ఎన్నటికీ తీరని బాధను మిగిల్చిపోయాడు. తనకు గుండెపోటు వచ్చిందని తెలిస్తే తల్లితండ్రులు తట్టుకోలేరనుకొన్న పవన్ కుమార్, వారు తన మరణాన్ని ఎలా తట్టుకోగలరని ఊహించలేకపోవడం అతని అపరిపక్వ ఆలోచనలకు నిదర్శనం. 

ఆ లేఖలో అక్కను ఎవరైనా వేధిస్తే పెద్దన్నకు చెప్పాలని పవన్ వ్రాయడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉండి ఉండవచ్చు. ఆ విషయం పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. ఇక తన సెల్ ఫోన్‌ అమ్మేసి ఆ డబ్బుతో తన అంత్యక్రియలు చేయాలని పవన్ వ్రాయడం అమాయకత్వమనుకోవాలో... అపరిపక్వత అనుకోవాలో తెలీదు. ఎందుకంటే, ఈరోజుల్లో అంత్యక్రియలకు కనీసం ఎంత ఖర్చవుతుందో అందరికీ తెలుసు. కానీ సెల్ ఫోన్‌ అమ్మిన డబ్బుతోనే చేస్తేనే తన ఆత్మకు శాంతి కలుగుతుందని వ్రాయడం ఆలోచించవలసిన విషయమే. అతను సెల్ ఫోన్‌కు బానిసగా మారిపోవడం వలననే ఆవిదంగా వ్రాసి ఉండవచ్చు. ఆ సూసైడ్ నోట్‌ను తరిచి చూస్తే అతనిది తొందరపాటుతో అపరిపక్వతతో తీసుకొన్న నిర్ణయమని అర్ధమవుతుంది. 


Related Post