టీఎస్‌ఆర్టీసీని గాడిలో పెడుతున్న సజ్జనార్

October 27, 2021


img

తెలంగాణ పోలీస్ శాఖలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరు పడ్డ వీసీ సజ్జనార్‌ను నష్టాల ఊబిలో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టరుగా ప్రభుత్వం నియమించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ టీఎస్‌ఆర్టీసీని కూడా మెల్లగా గాడిలో పెడుతున్నారు. ఇందుకోసం ఆయన ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. టీఎస్‌ఆర్టీసీ పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, పిక్నిక్కులకు ఎప్పటి నుంచో బస్సులు అద్దెకు ఇస్తోందనే సంగతి అందరికీ తెలుసు. అయితే టీఎస్‌ఆర్టీసీ విధించిన నిబంధనల వలన ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు చాలా సులువుగా బస్సులను అందజేస్తుండటంతో ప్రజలు వాటికే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయం గమనించిన సజ్జనార్, నవంబర్‌ నుంచి ప్రారంభమయ్యే పెళ్ళిళ్ళ సీజను కోసం నిబందనలను సడలించి ఎటువంటి డిపాజిట్ లేకుండానే అద్దెకు బస్సులు ఇవ్వాలని నిర్ణయించారు. వీటి కోసం ప్రత్యేకంగా ఓ కాల్ సెంటరును కూడా ఏర్పాటు చేయించారు. 

అలాగే త్వరలో టీఎస్‌ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లు, పార్సిల్, కార్గో కౌంటర్ల వద్ద యూపీఐ యాప్స్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులకు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. 

సామాన్యుల ప్రజా రవాణా వ్యవస్థ టీఎస్‌ఆర్టీసీ. దీనిని కాపాడేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. ఇప్పుడు వీసీ సజ్జనార్‌ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ప్రజలు కూడా తమ వివాహాదిశుభకార్యాలకు టీఎస్‌ఆర్టీసీ బుస్సులను బుక్ చేసుకొంటే వారు కూడా టీఎస్‌ఆర్టీసీని కాపాడుకోవడంలో భాగస్వాములవుతారు. టీఎస్‌ఆర్టీసీపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 40 వేల మంది ఉద్యోగులను వారి కుటుంబాలను కూడా ఆదుకొన్నట్లవుతుంది.


Related Post