ఏపీ నుంచి గంజాయి..తెలంగాణ నుంచి మద్యం

October 27, 2021


img

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య నిత్యం ఏదో అంశంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మద్యం, గంజాయి దళారులు, వ్యాపారులకు మాత్రం రెండు రాష్ట్రాలలో భిన్న పరిస్థితులు కాసులు కురిపిస్తున్నాయి. మద్యనిషేధం పేరిట ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచేయడంతో ఏపీలో మద్యానికి డిమాండ్ ఇంకా పెరిగింది. ఇది కొంతమందికి వరంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా సరిహద్దు జిల్లాలలో ఉండేవారికి ఈ మూడు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున మద్యం కొనుగోలు చేసి ఏపీలో అమ్ముకొంటూ ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించుకొంటున్నారు. ఇటీవల విజయవాడలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి ఓ ఇంట్లో తెలంగాణ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన నిలువచేసిన మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకోవడమే ఇందుకు తాజా నిదర్శనం.

ఇక హైదరాబాద్‌ నగరంలో పబ్బులు, క్లబ్బులు పెరగడంతో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ఈ కేసులలో ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మాదక ద్రవ్యాలు చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న గంజాయి వినియోగం పెరిగింది. ఇది ఏపీలో గంజాయి సాగుచేసేవారికి, దళారులు, వ్యాపారులకి వరంగా మారింది. ఏపీ నుంచి హైదరాబాద్‌తో సహా డిమాండ్ ఉన్న పెద్ద నగరాలకు గంజాయి తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. ఏపీ గంజాయి సాగు, సరఫరాకు కేంద్రంగా మారిందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తెలంగాణలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


Related Post