తెలంగాణలో ప్రతిపక్షాల చేతికి మరో బలమైన ఆయుధం

October 27, 2021


img

తెలంగాణ ప్రభుత్వంతో పోరాడేందుకు రాష్ట్రంలో ప్రతిపక్షాల చేతికి మరో బలమైన ఆయుధం లభించింది. కేంద్ర ప్రభుత్వం వద్ద బియ్యం నిలువలు పేరుకుపోవడంతో వచ్చే యాసంగి సీజనులో రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలుచేయలేమని చెప్పిందని, కనుక రాష్ట్రంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సిఎం కేసీఆర్‌ నెల రోజుల క్రితం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పుడు పెద్దగా స్పందించని ప్రతిపక్షాలు, సిఎం కేసీఆర్‌కు అత్యంత ప్రీతిపాత్రుడైన సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి తాజా వ్యాఖ్యలతో టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించాయి. 

సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వరికి ప్రత్యామ్నాయ పంటల గురించి ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. దానిలో ఆయన జిల్లాలో విత్తన వ్యాపారులు ఎవరూ వరి విత్తనాలు అమ్మరాదని, అమ్మితే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదే ప్రతిపక్షాలకు ఆయుధంగా అందివచ్చింది. 

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, “వేలకోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు వరి వేయవద్దని చెప్పడం ఏమిటి? అటువంటప్పుడు ఆ ప్రాజెక్టు ఎందుకు కట్టినట్లు?వరి తప్ప మరేమీ పండని భూములలో ఇప్పుడు వరి వేయవద్దంటే ఆ రైతులు ఏమి చేయాలి?” అని ప్రశ్నించారు. 

బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ కూడా ఇంచుమించు ఇదేవిదంగా స్పందించారు. “మంగళవారం మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాళేశ్వరం, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్, అనంత సాగర్ ప్రాజెక్టుల క్రింద ప్రధానంగా వరి సాగవుతుంటుంది. లక్షల కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు వరి వేయవద్దంటే ఆ రైతుల పరిస్థితి ఏమిటి?ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఏటా రూ.4,000 కోట్లు విద్యుత్ బిల్లు కడుతోంది. రైతులు వరి సాగుచేయొద్దంటే ఆ డబ్బు కూడా వృధాయే కదా? కాళేశ్వరం నీళ్ళు తోడి ప్రగతి భవన్‌లో పోసుకొంటారా?

ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని ప్రభుత్వం సలహా చెప్పడమే కానీ వాటికి గోడౌన్లు, మార్కెటింగ్ సదుపాయం వంటివి కల్పించదు. వాటికి మద్దతు ధర లభించదు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపిస్తామని ప్రభుత్వం చెప్పడమే తప్ప ఇంత వరకు ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో చెరుకు మిల్లులు నడవడం లేదు. ఇప్పుడు పత్తికి డిమాండ్ ఉన్నా తగినన్ని జిన్నింగ్ మిల్లులు లేవు. రైతులు వరి సాగుచేయవద్దంటే ఏమి చేయాలో ప్రభుత్వమే చెప్పాలి,” అని అన్నారు. 

సిద్ధిపేట కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. తాను సమావేశంలో ప్రత్యామ్నాయ పంటల గురించి మాట్లాడేనే తప్ప వరి వేయరాదని అనలేదని అన్నారు.


Related Post