అప్పుడేమో కారు సారు పదహారు.. ఇప్పుడేమో గూబ గుయ్!

October 12, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలొచ్చినా టిఆర్ఎస్‌కు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అలాగే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు టిఆర్ఎస్‌ ఎన్నికల వ్యూహాలు కూడా పక్కాగా ఉంటాయి. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌, టిడిపిలు పొత్తుపెట్టుకోవడం, చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో రాష్ట్రం మళ్ళీ పరాయిపాలనలోకి వెళ్ళిపోతుందంటూ, తెలంగాణ సెంటిమెంటు అస్త్రాలను ప్రయోగించి టిఆర్ఎస్‌ విజయం సాధించింది. 

ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలలో ‘కారు... సారు...పదహారు... ఢిల్లీ సర్కారు...’ అంటూ తొమ్మిది సీట్లు గెలుచుకొంది. అయితే ఉత్తరాది రాష్ట్రాలలో 30-40 లోక్‌సభ సీట్లు గెలుచుకొన్న పార్టీలే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయలేనప్పుడు, కేవలం 16 సీట్లు గెలుచుకొంటే టిఆర్ఎస్‌ పార్టీ ఢిల్లీలో సర్కారు ఎలా ఏర్పాటు చేస్తుందో ఎవరూ అడగలేదు...టిఆర్ఎస్‌ కూడా చెప్పలేదు. కానీ ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. 

ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఈటల రాజేందర్‌ మాత్రమే ప్రత్యర్ధి తప్ప బిజెపి కాదనే చెప్పవచ్చు. ఏవిదంగా అంటే ఒకవేళ ఆయన బిజెపిలొ చేరకపోయుంటే, బిజెపి ఎవరిని బరిలో నిలబెట్టినా టిఆర్ఎస్‌ పట్టించుకొనేదే కాదు. కానీ టిఆర్ఎస్‌కు గట్టి సవాలు విసురుతున్న ఈటల రాజేందర్‌ బిజెపిలో ఉన్నందునే, మంత్రి హరీష్‌రావు ఈటల రాజేందర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తూనే, బిజెపిని, కేంద్రప్రభుత్వాన్ని కూడా ముడిపెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. బహుశః ఏదోవిదంగా ఈ ఉపఎన్నికలో ఆయనపై ఎన్నికలలో పైచేయి సాధించడానికే మంత్రి హరీష్‌రావు ఈవిదంగా మాట్లాడుతుండవచ్చు. 

“ఇక్కడ హుజూరాబాద్‌లో ఓటర్లు కారు గుర్తుపై ఈవీఎం మీట నొక్కితే అక్కడ ఢిల్లీలో బిజెపి నాయకుల గూబలు గుయ్‌మనాలి...” అని మంత్రి హరీష్‌రావు అన్నారు. నిజానికి ఈ ఉపఎన్నికతో కేంద్రప్రభుత్వానికి, ఢిల్లీలో బిజెపి నేతలకు ఎటువంటి సంబందమూ లేదని అందరికీ తెలుసు. మరి మద్యలో వారిని ఎందుకు లాగడం? 

అలాగే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్రప్రభుత్వమే కారణమని, కనుక దానికి బుద్ధి చెప్పాలంటే ఇక్కడ ఈటల రాజేందర్‌ను ఓడిస్తే చాలని మంత్రి హరీష్‌రావు చెపుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గించాలనుకొంటే వాటిపై విధిస్తున్న పన్నులో రాష్ట్ర ప్రభుత్వం వాటాను తగ్గించుకోవచ్చు. కానీ ఆ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ సదస్సులో తాము తీవ్రంగా వ్యతిరేకించామని సిఎం కేసీఆర్‌ స్వయంగా శాసనసభలో చెప్పారు. కానీ ఇక్కడ మంత్రి హరీష్‌రావు వేరేలా చెపుతున్నారు. 

మంత్రి హరీష్‌రావు ఎన్నికల నిపుణుడు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు ఈవిదంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని ఎవరూ హర్షించలేరు. టిఆర్ఎస్‌కు ఏమాత్రం ‘ఫరక్ పడని’ హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏమిటి?కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించి కక్ష తీర్చుకోవడం కోసం ఎందుకు ఇంత తాపత్రయం?ఇంతమందిని మోహరించి ఇంత ప్రచారం చేసిన తరువాత ఒకవేళ ఈటల రాజేందర్‌ చేతిలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి ఓడిపోతే అప్పుడు మంత్రి హరీష్‌రావు పరువు ఏం కావాలి?


Related Post