ప్రకాష్ రాజ్‌ పరాయివాడా?

October 12, 2021


img

తెలుగు సినీ పరిశ్రమ పరువును పూర్తిగా గంగలో కలిపిన తరువాత మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసాయి. ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు విజయం సాధించగా, ప్రకాష్ రాజ్‌ ఓడిపోయారు. అంతవరకు ఒకరినొకరు చీత్కరించుకొన్న వారిరువురూ ఆప్యాయంగా కౌగలించుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే కడుపులో లేనిది కౌగలించుకొన్నంత మాత్రన్న రాదని నిన్న ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్‌ మాట్లాడిన మాటలు స్పష్టం చేశాయి. 

‘కళాకారులకు కులం, మతం, ప్రాంతం, బాష పరిమితులు ఉండవని అందరూ కళామతల్లి ముద్దు బిడ్డలే అని చెప్పిన ఇండస్ట్రీలో పెద్దలే ‘నువ్వు బయటవాడివి...అతిధిగా వచ్చినవాడివి అతిధిగానే ఉండాలని’ సుద్దులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓడిపోయినందుకు బాధపడటం లేదని, ఇన్నేళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమకే అంకితమైపోయిన తనను ‘మా’ సభ్యులు కూడా బయటి వ్యక్తిగానే భావించినందుకే బాధ పడ్డానని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటువేయడానికి పనికొచ్చే పరాయివాళ్ళు, పోటీ చేయడానికి పనికిరారన్నట్లు సినీ పెద్దలు మాట్లాడటం తనకు చాలా బాధ కలిగించిందని ప్రకాష్ రాజ్ అన్నారు. ‘మా’ సభ్యులు తనను తిరస్కరించినందున ఓటమిని అంగీకరిస్తున్నానని అన్నారు. ‘మా’ సభ్యులు తనను పరాయివాడిగా భావిస్తున్నందున, ఇటువంటి అభిప్రాయాలు, భావజాలం కలిగిన ‘మా’లో తాను కొనసాగలేనని భావించే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నానని చెప్పారు. ‘మా’కు దూరం అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమతో, ప్రేక్షకులతో తన అనుబంధం ఎప్పటిలాగే కొనసాగుతుందని ప్రకాష్ రాజ్ అన్నారు. 

ప్రకాష్ రాజ్‌ ‘మా’కు ఏమీ చేయలేరని భావించి ఆయనను ఓడించి ఉంటే ఎవరూ తప్పు పట్టలేరు కానీ పరాయివాడిగా భావించి ఓడించడమే చాలా బాధాకరం. ఆయన ఓటమికి ఇంకా అనేక కారణాలు ఉండి ఉండవచ్చు కానీ ఈ పరాయి కారణాన్ని జీర్ణించుకోవడం కష్టమే.

సినీ పరిశ్రమకు, రాజకీయాలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ ‘మా’ ఎన్నికలలో రాజకీయాలను చొప్పించడం పెద్ద తప్పు. దాని వలన ఎంత అనర్ధం జరిగిందో అందరూ చూశారు. 

రాజకీయ ఎన్నికలలో గెలిస్తే పదవులు, అధికారం, కాంట్రాక్టులు వాటి ద్వారా ఇబ్బడి ముబ్బడిగా అక్రమ సంపాదన వస్తుందనే ఆశతో రాజకీయ నాయకులు పోటీ చేస్తుంటారు కనుక అర్ధం చేసుకోవచ్చు. కానీ ‘మా’లో సమస్యలు తప్ప మరేమీలేవని అందరూ చెపుతున్నప్పుడు మరి ఇంత హోరాహోరీగా పోరాడుకోవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు. అంటే ‘మా’లో కూడా అదనపు రాబడి ఉంటుందనుకోవాలా? 

‘మా’ ఎన్నికలలో పాల్గొన్నవారు ఇంతగా ఎందుకు పోటీ పడ్డారో తెలియనప్పటికీ ఈ ‘మా’ ఎన్నికలతో తెలుగు సినీ పరిశ్రమలో నటీనటుల మద్య ఎన్ని లుకలుకలున్నాయో వారే స్వయంగా బయటపెట్టుకొని చేజేతులా ‘మా’ పరువు, సినీ పరిశ్రమ పరువు కూడా తీసుకొన్నారని చెప్పక తప్పదు. ‘మా’ ఎన్నికలు ముగిశాయి కనుక ఇకనైనా అందరూ సంయమనం పాటిస్తూ ఈ గొడవలను ముగిస్తే అందరికీ గౌరవంగా ఉంటుంది.     



Related Post