దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా ఉదృతి తగ్గిన తరువాత కూడా గతంలో రోజుకు 30-40 వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. అటువంటిది ఇప్పుడు రోజుకి 18 వేల కంటే తక్కువ కేసులే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా జోరుగా టీకాలు వేయడం, ప్రజలు మాస్కూలు ధరించడానికి బాగా అలవాటు పడటం, ఎప్పటికప్పుడు శానిటైజర్లతో చేతులు శుభ్రపరుచుకోవడం వంటి చిన్న చిన్న కరోనా జాగ్రత్తలు పాటిస్తుండటం వంటి అనేక కారణాల చేత దేశంలో కరోనా తీవ్రత, కేసులు తగ్గినట్లు భావించవచ్చు. దీంతో ఇటు ప్రభుత్వాలలో, అటు ప్రజలలో కూడా మళ్ళీ అలసత్వం కనిపిస్తోంది.
రాజకీయపార్టీల సభలు, సమావేశాలు, నేతల పాదయాత్రలకు భారీగా జనం హాజరవుతున్నారు. ఇప్పుడు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సీజన్ కూడా వచ్చేసింది. దీంతో మార్కెట్లు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, షాపింగ్ మాల్స్ అన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. సినిమా హాల్స్, పబ్బులు, పార్కులు వగైరా అన్నీ తెరుచుకొన్నాయి. ప్రజా రవాణా వ్యవస్థలన్నీ పునః ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో చాలామంది విహారయాత్రలకు బయలుదేరుతున్నారు కూడా.
రెండు డోసుల కరోనా టీకాలు వేసుకొన్నాము కనుక ఇక తమకు కరోనా సోకదనే ధీమా ప్రజలలో పెరిగిపోవడంతో చాలామంది మస్కూలు ధరించడం మానేశారు. మాస్కూలు పెట్టుకోకపోతే రూ.1,000 జరిమానా వేస్తామని హెచ్చరించిన ప్రభుత్వాలు, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు.
ఇవన్నీ దేశంలో మళ్ళీ కరోనా వ్యాపించేందుకు, పాజిటివ్ కేసులు పెరిగేందుకు దోహదపడేవే. ఈసారి జనసమూహాల నుంచి కరోనా కొత్త రూపం దాల్చి మళ్ళీ విరుచుకు పడినా ఆశ్చర్యం లేదు. కనుక ఇకనైనా ప్రభుత్వాలు, ప్రజలు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, మునిసిపల్ శాఖలు మేలుకొని ముందస్తు జాగ్రత్తలు పాటించడం మంచిది లేకుంటే తరువాత విచారించవలసిరావచ్చు.