సజ్జనార్ నిర్ణయంతో టీఎస్‌ఆర్టీసీకే మేలు

October 11, 2021


img

ఈ పండుగ సీజనులో టీఎస్‌ఆర్టీసీ సుమారు 4,000 పండుగ ప్రత్యేక బస్సులు నడుపోతోంది. అయితే ఈసారి ప్రయాణికుల నుంచి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నిర్ణయించారు. సాధారణంగా టీఎస్‌ఆర్టీసీకి ఇటువంటి పండుగ సీజన్లలోనే అదనపు సమకూరుతుంటుంది. నష్టాలలో కూరుకుపోయిన టీఎస్‌ఆర్టీసీకి ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ సజ్జనార్ దానిని వదులుకోవాలని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సజ్జనార్ చాలా సరైన నిర్ణయమే తీసుకొన్నారని చెప్పవచ్చు. పండుగ సీజనులో టికెట్ ఛార్జీలు పెంచడం ద్వారా రోజుకి రూ.40 లక్షలు ఆదాయం సమకూరుతుంది కానీ టీఎస్‌ఆర్టీసీ కూడా తమను దోచుకొంటోందని ప్రజలలో దురాభిప్రాయం ఏర్పడుతుంది. కనుక ప్రయాణికుల నమ్మకం, అభిమానం పొందేందుకు ఈ మాత్రం రిస్క్ తీసుకోవచ్చునని సజ్జనార్ చెప్పినట్లు తెలుస్తోంది. 

అయితే ఇదొక్కటే కారణం కాదు. ఈ పండుగ సీజనులో ప్రైవేట్ ట్రావెల్ సంస్థలన్నీ టికెట్ ఛార్జీలు 100-120 శాతం పెంచేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తుంటే, టీఎస్‌ఆర్టీసీ మాత్రం ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలకే ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చబోతోంది. పైగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు పండుగ స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. కనుక ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీవైపే మొగ్గుచూపుతారు. అప్పుడు టికెట్ ఛార్జీలు పెంచకపోయినా టీఎస్‌ఆర్టీసీకి ఆక్యుపెన్సీ పెరుగుతుంది కనుక ఆదాయం కూడా బాగానే పెరుగుతుంది. బహుశః ఈ ఆలోచనతోనే సజ్జనార్ టికెట్ ఛార్జీలు పెంచి ఉండకపోవచ్చు. కనుక సజ్జనార్ నిర్ణయం టీఎస్‌ఆర్టీసీకి మేలే చేయవచ్చు. ఆయన ఈ ఆలోచన సత్ఫలితం ఇచ్చిందో లేదో ఈ పండుగ సీజన్ ముగిసేలోగానే తేలిపోతుంది. 



Related Post