దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవించిన తరువాత తమిళనాడు శాసనసభ ఎన్నికలలో పాల్గొనేందుకు శశికళ ఉరకలేస్తూ వచ్చారు. కానీ సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజకీయాల నుంచి తప్పు కొంటున్నట్లు ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేశారు.
తన వలన అన్నాడీఎంకె పార్టీ ఎన్నికలలో నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్లు శశికళ చెప్పినప్పటికీ, కేంద్రప్రభుత్వం ఒత్తిడి వల్లే ఆమె అప్పుడు ఎన్నికలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి.
ఆమె దూరంగా ఉన్నప్పటికీ అన్నాడీఎంకె, బిజెపి కూటమి శాసనసభ ఎన్నికలలో ఓడిపోయింది. స్టాలిన్ నేతృత్వంలో డీఎంకె పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది. దీంతో అన్నాడీఎంకె పార్టీ బలహీనంగా ఉందిప్పుడు. కనుక ఆ పార్టీని చేజిక్కించుకోవడానికి ఇదే మంచి సమయమని బహుశః శశికళ భావిస్తున్నారేమో? అందుకే అన్నాడీఎంకెను కాపాడుకొనేందుకు తాన ప్రత్యక్ష రాజకీయాలలోకి తిరిగి వస్తున్నానని శశికళ నిన్న (ఆదివారం) ప్రకటించారు.
శశికళ ప్రకటన అన్నాడీఎంకె పార్టీలోనూ, తమిళనాడు రాజకీయాలలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకె పార్టీని నడిపిస్తున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వం తదితర నేతలు ఆమె వస్తే పార్టీ తమ చేతుల్లో నుంచి చేజారిపోతుందని ఆందోళన చెందుతుంటే, ఆమె వస్తే కొత్త సమస్యలు సృష్టిస్తూ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తారని అధికార డీఎంకె పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో నిలద్రొక్కువాలని విఫలయత్నాలు చేసిన బిజెపి కూడా బహుశః అదే కోరుకొంటుంది. పళని, పన్నీర్ ద్వారా బిజెపి ప్రయత్నాలు ఫలించలేదు కనుక ఈసారి కేంద్రప్రభుత్వం ఆమె జోలికి వెళ్ళకపోవచ్చు. వీలైతే ఆమెకు అండగా నిలబడినా ఆశ్చర్యం లేదు. కనుక అధికార డీఎంకె, ప్రతిపక్ష అన్నాడీఎంకె పార్టీలు ఆమెను ఎదుర్కొనేందుకు సిద్దపడక తప్పదు.