రోశయ్య అసెంబ్లీ ఉరేసుకోబోతే ఆపినా: కేసీఆర్‌

October 09, 2021


img

తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరి రోజున నిన్న సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని పట్టుకొని కడిగేశారు. సంక్షేమ పధకాలపై జరిగిన చర్చలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “ఒకప్పుడు తెలంగాణ నుండి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేవారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారే తెలంగాణకు వలసలు వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. మనం ఎటువంటి తెలంగాణ కావాలని కోరుకొన్నామో అటువంటి రాష్ట్రం మన కళ్ల ముందే ఉందిప్పుడు. ఇప్పుడు కరెంట్ కష్టాలు లేవు. నీళ్ళ కష్టాలు లేవు. 

గతంలో కరెంటు సమస్యను పరిష్కరించకలేకపోతే అసెంబ్లీలోనే ఉరేసుకొని చస్తానని శపధం చేసిన రోశయ్య ఆ పనిచేయలేక ఉరితాడు తెచ్చుకొంటే మేమే నచ్చజెప్పి ఆపాము. నిజానికి కాంగ్రెస్‌ పార్టీకి మేనేజిమెంట్ స్కిల్స్ లేవు. అందుకే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. 

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్నాయి. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ నిలవడం మన అందరికీ గర్వకారణం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమానావకాశాలు కల్పిస్తున్నాం. ప్రజలందరూ ఆత్మగౌరవంతో బ్రతికేలా చేస్తున్నాం. మన రాష్ట్ర సంస్కృతీ సాంప్రదాయాలను, పండుగలకు కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాం. యాదాద్రిని చాలా గొప్పగా అభివృద్ధి చేశాం. త్వరలోనే సుదర్శనయాగం నిర్వహించి ఆలయాన్ని పునః ప్రారంభిస్తాం. 

కేవలం ఏడు సంవత్సరాల కాలంలోనే ఇదంతా జరిగింది. బోనాల పండుగ వస్తే ముందుగా మా మంత్రులే వెళ్ళి పూనుకొని అన్నీ చేస్తుంటే, ప్రతిపక్షాలు మీ జేబులో డబ్బు ఏమైనా తీసి ఖర్చు చేస్తున్నారా? అంటూ చాలా చీప్‌గా మాట్లాడుతుంటారు. మంచిపనిని కూడా మెచ్చుకోలేని స్థితికి దిగజారిపోయారు. పొరుగు రాష్ట్రం ఏపీ కంటే, జాతీయస్థాయి కంటే తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. ఇది అభివృద్ధికి నిదర్శనం కాదా? కేంద్రప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం సాయపడకపోయినా సొంత తెలివితేటలు, స్వశక్తి, నిబద్దతతో రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసుకొన్నాము,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.


Related Post