ఆఫ్ఘనిస్తాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఓ మసీదులో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలడంతో వందమందికి పైగా మరణించగా అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లోని ఖాన్ ఆబాద్ అనే ప్రాంతంలో జరిగింది. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈ మసీదుపై గుర్తు తెలియని ఉగ్రవాదులు దాడి చేశారు.
సమాచారం అందుకొన్న తాలిబన్లు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఐసిస్-కె ఉగ్రవాదులే షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు కనుక ఇది కూడా వారి పనే అయ్యుండవచ్చని తాలిబన్ల అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని తెలిపారు.
ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి, అమెరికన్ సైనికులకు తాలిబన్లు ఇటువంటి మారణ హోమంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తే, ఇప్పుడు తాలిబన్లకు ఐసిస్-కె ఉగ్రవాదులు అదే చేసి చూపిస్తున్నారు. దీంతో తాలిబన్లకు ఆనాడు తమ వలన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఏవిదంగా సమస్యలు ఎదుర్కొందో అర్ధమవుతుంది. ఒక ఉగ్రవాద సంస్థ అధ్వర్యంలో నడుస్తున్న ఓ ప్రభుత్వానికి మరో ఉగ్రవాద సంస్థ ఈవిధంగా సవాళ్ళు విసురుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.