పాక్‌-ఆఫ్ఘన్‌ క్రికెట్ మ్యాచ్!

September 24, 2021


img

న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు భద్రత కారణాలతో పాకిస్థాన్‌లో క్రికెట్ సిరీస్ రద్దు చేసుకోవడంతో ఆ దేశం పరువుపోయింది. దీంతో ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకొన్న పాక్‌ క్రికెట్ బోర్డును ఆదుకొనేందుకు ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. 

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత క్రికెట్ బోర్డుకు అజీజుల్లా ఫజ్లీని ఛైర్మన్‌గా నియమించింది. ఆయన త్వరలో పాకిస్థాన్‌లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా కాబూల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పాక్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ రమీజ్ రాజాను కలిసి, రెండు దేశాల క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని కోరుతాను. నిజానికి శ్రీలంకలో పాక్‌-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మద్య మ్యాచ్‌లు జరుగవలసి ఉంది కానీ కరోనా కారణంగా మ్యాచ్‌లు రద్దయ్యాయి. కనుక ఇప్పుడు పాక్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్లతో సిరీస్ నిర్వహించాలనుకొంటున్నాము. దీనిలో భారత్‌, బాంగ్లాదేశ్, యూఏఈ కూడా పాల్గొవాలని ఆయా దేశాల బోర్డులను కోరుతాము,” అని అన్నారు. 

భారత్‌కు ఏమాత్రం తీసిపోని జట్లలో పాక్‌ క్రికెట్ జట్టు కూడా ఒకటని అందరికీ తెలుసు. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లలో తన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకొంది. కానీ వారి ప్రభుత్వ విధానాలే ఆ రెండు దేశాల జట్లకు శాపంగా మారాయి. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో ఏకంగా ఉగ్రవాదులే (తాలిబన్లు) రాజ్యం ఏలుతున్నారిప్పుడు. కనుక ఆ రెండు దేశాల క్రీడాకారులలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ వారి ప్రభుత్వాలే వారికీ ప్రపంచదేశాలకు మద్య అడ్డుగోడలా నిలుస్తున్నాయని చెప్పక తప్పదు. వాటి వైఖరి, విధానాలలో ఎన్నటికీ మార్పు రాదు కనుక వాటి క్రీడాకారులు ఎప్పటికీ శాపగ్రస్తులుగా మిగిలిపోవలసిందే! 

ప్రస్తుతం పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ రెండూ ఒకే కోవకు చెందినవిగా ఉన్నాయి కనుక ఆ రెండు దేశాలు క్రికెట్ ఆడుకోవాలనుకోవడం వారి క్రీడాకారులకు కాస్త ఉపశమనం కలిగించవచ్చు.


Related Post