ఆఫ్ఘనిస్తాన్‌కు అమెరికా గుడ్ బై

August 31, 2021


img

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి చివరి బ్యాచ్ అమెరికా సైనికులు ఈరోజు తెల్లవారుజామున మిలటరీ విమానంలో స్వదేశానికి తిరిగివెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వాషింగ్‌టన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “దీంతో 20 ఏళ్ళ సుదీర్గ యుద్దం ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని కాపాడటం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమెరికన్ సైనికులకు కృతజ్ఞతలు. ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల నడుమ మిగిలిన అమెరికా సైనికులు అందరూ సురక్షితంగా దేశానికి తిరిగివచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.        

ఆఫ్ఘనిస్తాన్‌లో సైనిక దళాల మోహరింపు, తాలిబన్లతో 20 ఏళ్ళ సుదీర్గ యుద్ధం అమెరికాకు ఆర్ధికంగా, సైనికపరంగా కూడా చాలా భారమే. అయితే 20 ఏళ్ళు యుద్ధం చేసి, లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసి, వేలాదిమంది అమెరికన్ సైనికులను బలి ఇచ్చిన తరువాత చివరికి ఏమి సాధించలేక చేతులెత్తేసి తిరిగి వెళ్ళిపోవడం అమెరికాకు తీరని అప్రదిష్టే కానీ అమెరికాకు ఇది పరిపాటే. ప్రపంచశాంతి నెలకొల్పడానికి కాంట్రాక్ట్ తీసుకొన్నట్లు మాట్లాడే అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌ 20 ఏళ్ళపాటు తాలిబన్లతో పోరాడినా వారిని నిర్మూలించలేకపోయింది...శాంతి నెలకొల్పలేకపోయిందని ఇటీవల కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన భారీ ఆత్మహుతి దాడులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. 

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ పూర్తవక మునుపే తాలిబన్లు వారి కళ్లెదుటే ఆఫ్ఘనిస్తాన్‌ను కేవలం వారం రోజుల వ్యవధిలో తిరిగి ఆక్రమించుకొన్నారు. దీనిని అమెరికా దారుణ ఓటమిగానే భావించాల్సి ఉంటుంది. అంతేకాదు... ఇన్నేళ్ళుగా ‘మేమున్నామని...’ ఆఫ్ఘన్‌ ప్రజలకు భరోసా ఇచ్చిన అమెరికా వారిని మళ్ళీ అదే తాలిబన్లకు అప్పగించి చేతులు దులుపుకొంది. ఏవిదంగా చూసినా ఇది అమెరికా ఘోర వైఫల్యమే. దీనికి ఇప్పుడు ఆఫ్ఘన్‌ ప్రజలు మూల్యం చెల్లించవలసివస్తోంది.


Related Post