ఇటీవల బీఎస్పీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగాలు వింటే ఆయన సిఎం కేసీఆర్ వైఖరిని, పాలనను, విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టమవుతుంది.
గురువారం కరీంనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కూడా ఆయన మళ్ళీ సిఎం కేసీఆర్, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఓ పేద బీసీ మంత్రి (ఈటల రాజేందర్)ను బలవంతంగా పదవిలో నుంచి తొలగించి, ఇప్పుడు ఆయనను హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడించేందుకు కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని దళిత బంధు పధకంతో ఖర్చు చేస్తున్నారు. ఇన్నేళ్ళుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న సిఎం కేసీఆర్‌కు ఇంతకాలం దళితులు గుర్తుకు రాలేదా? హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ తొండిగా మొండిగానైనా సరే గెలిచితీరాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. కనుక టిఆర్ఎస్‌కు ప్రజలే బుద్ది చెప్పాలి,” అని అన్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఇంకా చాలా విమర్శలు చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవన్నీ అప్రస్తుత విషయాలు. ఆయన హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు మద్దతు పలుకుతున్నారా? టిఆర్ఎస్‌కు బుద్ధి చెప్పమని బడుగుబలహీనవర్గాల ప్రజలను కోరుతున్నారు కనుక వారందరినీ ఈటలకు ఓట్లు వేయమని సూచిస్తున్నారా? అనే సందేహం కలుగక మానదు.ఓ పక్క బిజెపిని విమర్శిస్తూ ఈటల రాజేందర్‌కు ఓట్లేయాలన్నట్లు ఆయన మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది.
అయినా వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ప్రవీణ్ కుమార్ అంత నమ్మకంగా చెపుతున్నప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో ఆయన లేదా బీఎస్పీ అభ్యర్ధి పోటీ చేసి టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఓడించి తమ సత్తా చాటుకోవచ్చు కదా? ఉపఎన్నికపై తమ పార్టీ వైఖరి ఏమిటో చెప్పకుండా టిఆర్ఎస్‌ను, సిఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ హుజూరాబాద్ ఓటర్లను ఆలోచించి ఓట్లు వేయాలని చెప్పడానికి అర్ధం ఏమిటి?