తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా చేస్తున్న సజ్జనార్‌ను నష్టాల ఊబిలో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టరుగా బదిలీ చేసి, ఆయన స్థానంలో స్టీఫెన్ రవీందర్‌ను నియమించింది. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సజ్జనార్ ఇటీవలే అడిషనల్ డీజీగా పదోన్నతి పొందారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అనేక క్లిష్టమైన కేసులను పరిష్కరించి పోలీస్ శాఖలో చాలా సమార్దుడైన అధికారిగా పేరుపొందారు. కనుక పోలీస్ శాఖలో ఇంకా అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉన్న ఆయనకు నష్టాల ఊబిలో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీ బాధ్యతలు అప్పగించడం చాలా ఆశ్చర్యకరమే. కానీ ఒకవేళ టీఎస్‌ఆర్టీసీని లాభాల బాట పట్టించగలిగితే మరోసారి ఆయన సామర్ధ్యం నిరూపించుకొన్నట్లవుతుంది.