తమిళనాడులో కత్తులు...పొత్తులు

March 03, 2021


img

తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్రంలో రోజురోజుకీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా డీఎంకె, అన్నాడీఎంకె పార్టీల మద్యనే పోటీ జరుగబోతోంది. వాటికి చెక్ పెట్టేందుకు ఎప్పటిలాగే మూడో కూటమి కూడా తయారైంది. దానిలో కమల్ హాసన్‌ (మక్కల్ నీది మయ్యుమ్) కూడా చేరారు. ఆ కూటమిలో శశికళను చేర్చుకోకూడదని, తానే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉంటాననే రెండు షరతులతో ఆయన మూడో కూటమిలో చేరారు.

నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవించి చెన్నై తిరిగివచ్చిన శశికళ అన్నాడీఎంకె పార్టీని చీల్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తన మేనల్లుడు దినకరన్ స్థాపించిన ఏఎంఎంకే పార్టీ నేతృత్వంలో 4వ కూటమి ఏర్పాటుకు సిద్దమవుతున్నారు.

ఇంతవరకు అన్నాడీఎంకె పార్టీకి అండగా నిలబడిన బిజెపి, ఆమెతో చేతులు కలిపి నాలుగో కూటమిలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం. గతంలో శశికళకు అడ్డుకట్టవేసిన బిజెపి ఇప్పుడు రాష్ట్రంలో అడుగుపెట్టడం కోసం ఆమెతోనే చేతులు కలపడానికి సిద్దపడుతుండటం విస్మయం కలిగిస్తుంది. అయితే ఇంకా సీట్ల సర్దుబాట్లు, ఇరుపార్టీల మద్య షరతులు, నిబందనాలపై రహస్య చర్చలు కొనసాగుతున్నందున దోస్తీపై ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు.

ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని అన్నాడీఎంకె పార్టీ, ఐదేళ్ళుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న డీఎంకె పార్టీ, ముఖ్యమంత్రి కలను సాకారం చేసుకోవాలని ఆరాటపడుతున్న కమల్ హాసన్‌, శశికళలు, వీటన్నిటి మద్య రాష్ట్రంలో పాగా వేయాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్‌, బిజెపిలతో...తమిళనాట రాజకీయాలు, సమీకరణాలు చాలా రసవత్తరంగా మారాయి. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్, మే 2న ఫలితాలు వెలువడతాయి. 


Related Post