వామన్ రావు దంపతుల హత్యకేసుపై స్పందించిన కేటీఆర్‌

March 03, 2021


img

హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసుపై తొలిసారిగా టిఆర్ఎస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం  తరపున ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో పార్టీ లీగల్ సెల్ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వామన్ రావు దంపతుల హత్య చాలా బాధ కలిగించింది. అందుకు కారకుడైన వ్యక్తిని వెంటనే పార్టీలో నుంచి తొలగించి పోలీస్ దర్యాప్తు జరిపిస్తున్నాము. హంతకులకు తప్పకుండా కటిన శిక్షపడేలా చేస్తాము. రాష్ట్రంలోని న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చేందుకు అవకాశం ఉంటే పరిశీలించి తెస్తాము. దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రూ.100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్దిలేదు. ఉంటే రూ.10,000 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్‌ బలహీనపడటం వలననే బిజెపి ఆటలు సాగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ పీవీని అవమానిస్తే తెలంగాణ ప్రభుత్వం ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ గౌరవిస్తోంది. ఇప్పుడు ఆయన కుమార్తె సురభి వీణాదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గౌరవిస్తుంటే, కాంగ్రెస్‌, బిజెపిలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. కనుక న్యాయవాదులందరూ ఆమెకే ఓటేసి గెలిపించి వాటికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికలు పూర్తవగానే వేతన సవరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుంది,” అని చెప్పారు. 

ఎమ్మెల్సీ, మునిసిపల్ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ముందు హైకోర్టు న్యాయవాద దంపతులను అధికార పార్టీకి చెందిన నేత పట్టపగలు హత్య చేయడంతో ప్రతిపక్షాల చేతికి బలమైన ఆయుధం లభించినట్లయింది. ఇది టిఆర్ఎస్‌కు రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన విషయమే. కానీ ఎన్నికలను ఎదుర్కొని గెలవడం తప్పనిసరి కనుక ఎట్టకేలకు టిఆర్ఎస్‌ తరపున కేటీఆర్‌ ఈవిదంగా స్పందించారు. కేటీఆర్‌ ఇచ్చిన ఈ వివరణతో న్యాయవాదులు ఆందోళనలు విరమించి టిఆర్ఎస్‌కు ఓటేసి గెలిపిస్తారా?దీంతో టిఆర్ఎస్‌ ప్రతిపక్షాలను ఎదుర్కొని పట్టభద్ర ఓటర్లను తమవైపు తిప్పుకోగలదా? అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం మార్చి 17న లభిస్తుంది. 


Related Post