బిజెపి ధీమా ఏమిటో?

March 02, 2021


img

త్వరలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అక్కడ ప్రాంతీయభిమానం కూడా చాలా ఎక్కువగానే ఉంది కనుక ఆ రెండు రాష్ట్రాలలో బిజెపికి ఎదురీత తప్పదు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి దెబ్బతీయాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాలతో ఆ రాష్ట్రంలో బెంగాలీ సెంటిమెంట్ ఇప్పుడు బాగా రాజుకొంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో బిజెపిని ఉత్తరాది హిందీ పార్టీగా భావించి దూరంగా పెడుతుంటారనే సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో సంస్కృతి, బాష కూడా బిజెపికి అడ్డుగోడగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో మూడు రాష్ట్రాలలో బిజెపి ఎదురీదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

మరోపక్క రోజురోజుకీ పెరుగుతున పెట్రోల్, డీజిల్ ధరలు, నెలనెలా వంద రూపాయలు చొప్పున పెరుగుతున్న వంట గ్యాస్ ధరలతో ప్రజలు కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ఇప్పటి వరకు కేంద్రమంత్రులు, బిజెపి ఎంపీలు ఎవరూ మాట్లాడలేదు. అందరూ ప్రతిపక్షాలపై విమర్శలకు, బిజెపి గురించి గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమవుతున్నారు. దీంతో ప్రజలు మరింత అసహనానికి లోనవుతున్నారు. ఆయా రాష్ట్రాలలో నెలకొన్న ప్రాంతీయ అభిమానం, సెంటిమెంట్లకు తోడు పెరుగుతున్న ఈ ధరలు కూడా బిజెపి విజయావకాశాలపై ప్రభావం చూపించవచ్చు. ఈ సంగతి తెలిసి ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం, బిజెపి నేతలు నిర్భయంగా ఎన్నికల యావలోనే మునిగితేలుతుండటం విశేషం.బీజేపీ ధీమాకు కారణం ఏమిటో?


Related Post