అన్న తమిళనాడులో..చెల్లమ్మ అసోంలో...

March 02, 2021


img

అసోం శాసనసభకు ఈనెల 27 నుంచి మూడు దశలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఒకప్పుడు అసోం రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది కానీ గత ఎన్నికలలో బిజెపి అసోంను కూడా చేజిక్కించుకొంది. కనుక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఈసారి ఎలాగైనా మళ్ళీ అసోంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. కనుక ఆమె అసోంలో పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్ అనే ప్రాంతంలో గల తేయాకు తోటల వద్దకు వెళ్ళి అక్కడ తేయాకు కోస్తున్న వ్యవసాయ కూలీలతో ముచ్చటపెట్టుకొన్నారు. వారిలో ఓ మహిళ నెత్తిన పెట్టుకొన్న బుట్టను తీసుకొని తన నెత్తిన పెట్టుకొని ప్రియాంకా వాద్రా వారితో కబుర్లు చెపుతూ కాసేపు తేయాకు ఆకులను కోశారు. అనంతరం వారితో కూర్చొని మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

ప్రియాంకా వాద్రా అసోంలో పర్యటిస్తుండగా ఆమె సోదరుడు రాహుల్ గాంధీ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అసోంలో మొత్తం 126 శాసనసభ స్థానాలున్నాయి. వాటికి 3 దశలలో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీలలో ఎన్నికలు జరుగనున్నాయి. 

తమిళనాడులోని 234 స్థానాలకు ఒకేసారి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. మే 2వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.


Related Post