చివరికి రాహుల్ గాంధీకి బోదపడింది కానీ...

March 02, 2021


img

తమిళనాడు రాష్ట్రంపై పట్టు సాధించాలని కాంగ్రెస్‌, బిజెపిలు దశాబ్ధాలుగా ప్రయత్నిస్తున్నాయి కానీ తమిళప్రజలు వాటిని తిరస్కరిస్తూనే ఉన్నారు. దాంతో ఆ రెండు పార్టీలు డీఎంకె, అన్నాడీఎంకె పార్టీలతో పొత్తులు పెట్టుకొని పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి కానీ అవీ ఫలించడం లేదు కనుక వేరే దారిలేకపోవడంతో డీఎంకె, అన్నాడీఎంకె పార్టీలకు తోకపార్టీలుగానే కొనసాగుతున్నాయి. 

త్వరలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞానోదయం అయినట్లే ఉంది. తమిళ ప్రజలను ఆ రాష్ట్రానికి చెందిన వారి ప్రతినిధులు తప్ప బయట నుంచివచ్చిన వారు పరిపాలించలేరని అన్నారు. తమిళ ప్రజలకు అసలు సిసలైన ప్రతినిధి ఎవరో...వారే రాష్ట్రాన్ని పాలించాలని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కనుసన్నలలో పనిచేస్తున్న పళని స్వామి ప్రభుత్వం తమిళ ప్రజల ప్రతినిధి కాబోరన్నారు. తమిళ సంస్కృతి, తమిళ బాష గొప్పదనం, తమిళుల ఆత్మగౌరవం, మనోభావాలను పట్టించుకోకుండా ఒకే బాష, ఒకే సంస్కృతి, ఒకే జాతి అంటున్న నరేంద్రమోడీని, బిజెపిని, ఆర్‌ఎస్ఎస్‌లను తమిళనాడులో అడుగుపెట్టనీయవద్దని రాహుల్ గాంధీ కోరారు.  

బిజెపిని ఉత్తరాది పార్టీగా భావిస్తున్న తమిళ ప్రజలు దానిని దూరం పెడుతుంటే, శ్రీలంకలో శాంతిస్థాపన పేరిట అక్కడి తమిళులపైకి భారత్‌ సైనికులను పంపించినందుకు కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతున్నారు. ఈ విషయం రాహుల్ గాంధీ గ్రహించినట్లే ఉన్నారు. తమిళనాడులో కాంగ్రెస్‌, బిజెపిలు ఎన్నటికీ నేరుగా అధికారం చేపట్టలేవని ఆయన గ్రహించినట్లే ఉన్నారు. అందుకే తమిళనాడును తమిళ ప్రజలే పరిపాలించుకోవాలని చెపుతున్నారనుకోవచ్చు. ఆయన చెప్పినా చెప్పకపోయిన జరుగబోయేది అదే!


Related Post