తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందినవారి చేతిలోనే నడుస్తోందనేది బహిరంగ రహస్యం. కనుక రాష్ట్రంలో ఆ సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటం సహజంమే. అలాగే బడుగుబలహీనవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగానే ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ షర్మిళ రాకతో ఆ ఓటు బ్యాంకులో చీలిక ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వి.హనుమంతరావు తదితరులు ఈవిషయం ముందే గ్రహించారు కనుకనే వారు ఆమె రాకను గట్టిగా వ్యతిరేకించారు. టిఆర్ఎస్, బిజెపిలు కూడా షర్మిళ తెలంగాణ రాజకీయ ప్రవేశాన్ని ఆక్షేపించాయి కానీ ఇటువంటివాటికి ఆమె ముందే సిద్ధపడి వచ్చినందున తన అనుచరుల ద్వారా వాటికి ధీటుగా బదులిప్పిస్తున్నారు.
రేవంత్ రెడ్డి విమర్శలపై షర్మిళ అనుచరుడు తూడి దేవేందర్ రెడ్డి స్పందిస్తూ, “రాష్ట్రంలో షర్మిళకు లభిస్తున్న ప్రజాధారణ, ఆమె రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ అభిమానుల మద్దతు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకు వేయలేదు. వైఎస్ అభిమానుల మద్దతుతో పిసిసి అధ్యక్షుడు కావాలని తహతహలాడుతున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు వారందరూ షర్మిళ వెనుక నడుస్తుండటంతో కంటగింపుగా ఉంది,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇంకా వైఎస్ అభిమానులున్నారో లేదో తెలీదు కానీ ఆ పేరుతో షర్మిళ కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పదవులు, గుర్తింపుకు నోచుకోని ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను షర్మిళ ఆకర్షించగలిగితే చాలు....కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడుతుంది. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో షర్మిళ భారీ బహిరంగసభ నిర్వహించి కొత్త పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.