బోధన్‌కు మరో 80 పాస్‌పోర్టులు!

February 27, 2021


img

నిజామాబాద్‌ జిల్లా బోధన్ పట్టణం పేరు ఇప్పుడు రాష్ట్రంలో మారుమ్రోగిపోతోంది. అంటే అక్కడేదో గొప్పగా చెప్పుకొనేది జరుగుతోందని కాదు...నకిలీ దృవపత్రాలతో పాస్‌పోర్టులు పొందడానికి బోధన్ పట్టణం అడ్డాగా మారినందునే. పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి కొన్ని రోజుల క్రితమే ఈ పాస్‌పోర్టు దందాను బయటపెట్టి కొందరిని అరెస్ట్ చేశారు. ఒకే చిరునామాతో డజన్ల కొద్దీ పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. అదికూడా...దేశంలో అక్రమంగా జొరబడిన బంగ్లాదేశీయులు కావడం విస్మయం కలిగిస్తుంది. 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి వచ్చిన బంగారు ఆభరణాలు తయారుచేసే కార్మికులు బోధన్‌ పట్టణంలో పనిచేస్తున్నారు. బంగ్లాదేశీయులకు వారితో కలిసిపోవడం సులువు కనుక నకిలీ దృవపత్రాలతో పాస్‌పోర్టులు పొందడానికి వారికి బోధన్ అడ్డాగా మారింది. కొంతమంది స్థానికులు, బ్రోకర్ల సహకారంతో వారు నకిలీ దృవపత్రాలు సృష్టించి సులువుగా పాస్‌పోర్టులు పొందుతున్నారు. 

పోలీసుల లెక్కల ప్రకారం ఆవిధంగా ఇప్పటివరకు మొత్తం 72 మంది పాస్‌పోర్టులు పొందారు. ఒకపక్క ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే తాజాగా శనివారం రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి బోధన్ పోస్టాఫీసుకు 80 పాస్‌పోర్టులు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అవన్నీ స్థానిక షర్బత్ కెనాల్ రోడ్డులోని నాలుగు ఇళ్ళకు డెలివరీ చేయవలసి ఉంది. కానీ పోలీసుల దాడులకి భయపడి ఆ ఇళ్ళలో ఉన్నవారు ముందే పారిపోవడంతో పోస్టల్ సిబ్బంది ‘డోర్ లాక్‌’ అని పాస్ పోర్ట్ కార్యాలయానికి తిప్పి పంపించేశారు. ఒకవేళ ఈ పాస్‌పోర్టు దందా బయటపడకపోయుంటే అవన్నీ బంగ్లాదేశీయులకు అంది ఉండేవి. ఈ పాస్‌పోర్టు దందా గుట్టుగా సాగిపోతుండేది.


Related Post