త్వరలో నాగార్జునసాగర్ ఉపఎన్నికల నోటిఫికేషన్‌

February 27, 2021


img

కేంద్ర ఎన్నికల కమీషనర్‌ సునీల్ అరోరా శుక్రవారం సాయంత్రం నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ త్వరలోనే 16 రాష్ట్రాలలో 34 అసెంబ్లీ స్థానాలకు, 4 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని చెప్పారు. వాటిలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం కూడా ఒకటి. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల మృతితో నాగార్జునసాగర్ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. 

ఈ ఎన్నికలు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 29వరకు జరుగనున్నాయి. వాటితో కలిపి ఈ ఉపఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పినందున ఆ మద్య కాలంలోనే నాగార్జునసాగర్ ఉపఎన్నికలు కూడా జరుగనున్నాయని స్పష్టం అయ్యింది. రేపటితో ఫిబ్రవరి నెల ముగుస్తుంది కనుక మార్చి వచ్చేసినట్లే. కనుక నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు. 

ఈసారి కాంగ్రెస్‌ పార్టీ టిఆర్ఎస్‌, బిజెపిల కంటే ముందుగా తమ అభ్యర్ధిగా కె.జానారెడ్డి పేరును ప్రకటించింది. బిజెపి బలమైన అభ్యర్ధి కోసం ఇంకా వెతుకుతోంది. టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా నోముల కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరిని నిలబెట్టాలా లేదా ఈసారి వేరే వారిని నిలబెట్టలా అనే డైలమాలో టిఆర్ఎస్‌ ఉంది. అయితే ఇప్పటికే జానారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించేసినందున ఇంకా ఆలస్యం చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది కనుక త్వరలోనే బిజెపి, టిఆర్ఎస్‌ కూడా అభ్యర్ధులను ప్రకటించవచ్చు.


Related Post