కాంగ్రెస్‌, బిజెపిలు పీవీకి సముచిత గౌరవం ఇవ్వలేదు: వాణీదేవి

February 26, 2021


img

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా బరిలో దిగుతున్న స్వర్గీయ పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి తాజా ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. 

“కాంగ్రెస్‌, బిజెపిలు మా తండ్రిగారికి సముచిత గౌరవం ఇవ్వలేదనే బాధ నేటికీ మా కుటుంబంలో అందరికీ ఉంది. ఆయన దక్షిణాదిరాష్ట్రానికి చెందిన తెలుగువారు కనుకనే కాంగ్రెస్‌, బిజెపిల దృష్టికి ఆనలేదని భావిస్తున్నాను. సిఎం కేసీఆర్‌ నాకు టికెట్ ఇవ్వడం రాజకీయమని వాదిస్తున్న కాంగ్రెస్, బిజెపి నేతలు మా తండ్రిగారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు?ఇచ్చి అవి కూడా రాజకీయలబ్ది పొందవచ్చు కదా?స్వర్గీయ పీవీపై మొదటి నుంచి సిఎం కేసీఆర్‌ చాలా గౌరవం కనబరిచేవారు. ఆ గౌరవంతోనే మా తండ్రిగారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని శాసనసభలో తీర్మానం కూడా చేశారు. ఆయనపై గౌరవంతోనే ఇప్పుడు నాకు తగిన అవకాశం రావడంతో టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు తప్ప వేరే కారణమేమీ లేదు. నేను గత మూడున్నర దశాబ్ధాలుగా విద్యారంగంలో ఉన్నాను. కనుక విద్యార్దులు, నిరుద్యోగుల సమస్యల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. నాకు అవకాశం ఇస్తే నేను వారి సమస్యలను పరిష్కరించగలనని భావిస్తున్నాను. ఆనాడు మన దేశం క్లిష్టపరిస్థితులలో నుంచి బయటపడేసిన వ్యక్తి మా తండ్రిగారు. అలాగే తెలంగాణ రాష్ట్రం సాధించి కేవలం ఆరున్నరేళ్ళలో ప్రజల కష్టాలను తీర్చుతున్న వ్యక్తి సిఎం కేసీఆర్‌. అటువంటి మహానుభావుడు తెలంగాణ రాష్ట్రానికి మీ సేవలు అవసరం అంటే కాదనడం నాకు భావ్యం కాదు కనుక అంగీకరించాను. నామినేటడ్ పదవి కంటే ప్రజామోదంతో చట్టసభలలో అడుగుపెట్టడమే సరైనపద్దతి అని మా తండ్రిగారు భావించేవారు. నేను కూడా అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్నాను,” అని చెప్పారు.


Related Post