దేశంలో వివిద రాష్ట్రాలలో ఎన్నికల కోసం బిజెపి అవలంభిస్తున్న విధానాలపై టిఆర్ఎస్ నేత సుషీల్ రెడ్డి చాలా ఆలోచనాత్మకమైన విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకి నేతాజీ సుభాస్ చంద్రబోస్, గుజరాత్ ఎన్నికలకి సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్, కర్ణాటక ఎన్నికలకి టిప్పు సుల్తాన్, తెలంగాణ ఎన్నికలకి నిజాం, రజాకార్లు, పార్లమెంటు ఎన్నికలకి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సెంటిమెంట్ రాజేసి బిజెపి లబ్ది పొందాలని యత్నిస్తుంటుందని సుశీల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆమె మాటలు అక్షర సత్యాలని అందరికీ తెలుసు.
ఒకప్పుడు ఎన్నికల ప్రచారసభలలో ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమం ప్రధానాంశాలుగా మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించేవారు. కానీ గత కొన్నేళ్ళుగా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని అంశాలను తెరపైకి తెచ్చి వారిలో భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే దీనికి టిఆర్ఎస్ కూడా అతీతం కాదనే చెప్పాలి. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని లబ్ది పొందాలని ప్రయత్నిస్తుండటం అందరికీ తెలిసిందే. టిఆర్ఎస్, బిజెపిలకు బలమైన సెంటిమెంట్ అస్త్రాలున్నాయి కానీ పాపం...కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అస్త్రాలు సమకూర్చుకోలేక బోర్లాపడుతోంది.