ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన

February 25, 2021


img

ప్రధాని నరేంద్రమోడీ నిన్న ఓ సంచలన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడంపై బుదవారం జరిగిన వెబినార్‌లో మాట్లాడుతూ, “దేశాన్ని పాలించడమే ప్రభుత్వ ప్రధానబాధ్యత తప్ప వ్యాపారాలు చేయడం కాదు. కనుక నాలుగు ప్రధానరంగాలలో తప్ప మిగిలిన 100 పబ్లిక్ సెక్టర్ యూనిట్‌ (పీఎస్‌యు)లలో అవసరమైన మాత్రమే నామమాత్రపు వాటాను ఉంచుకొని మిగిలిన అన్నిటి నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొంటుంది. దశాబ్ధాలుగా పీఎస్‌యులను నడిపిస్తున్నామనో లేదా వాటితో ఉద్యోగాలు కల్పిస్తున్నామనో వాటిని కేంద్రప్రభుత్వం నడిపించాలనుకోవడం సరికాదు. ఇంతకాలం ఆవిదంగా నడిపిస్తుండటం వలన సామాన్యప్రజలు చెల్లించే పన్ను ఆదాయంతో వాటి నష్టాలను భర్తీ చేయవలసివస్తోంది. ఇది వారిని అన్యాయం చేయడంగానే భావిస్తున్నాను.

ప్రైవేట్ రంగంలో అవే పరిశ్రమలు, సంస్థలు లాభాలతో నడుస్తున్నాయి. అవి ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ అద్భుతమైన పనితీరు, మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. వాటిలో ప్రతిభావంతులకు భారీగా జీతభత్యాలు లభిస్తున్నాయి. అయినా ప్రభుత్వం వ్యాపారాలు చేయవలసిన అవసరం ఏమిటి? అది ప్రభుత్వంపై అదనపు భారమే అవుతుంది తప్ప దాని వలన ఒరిగిదేమిటి?

కనుక అణుఇంధనం, అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు, రక్షణ, రవాణా, టెలీకమ్యూనికేషన్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్, భీమా, ఆర్ధిక సేవలు రంగాలలో మాత్రమే కేంద్రప్రభుత్వం అవసరమైన మేరకు పెట్టుబడులు కొనసాగిస్తూ మిగిలిన అన్ని పీఎస్‌యుల నుంచి సుమారు రూ.2.5 లక్షల కోట్లు పెట్టుబడులు ఉపసంహరించడానికి కట్టుబడి ఉంది. ఆ సొమ్ముతో దేశంలో మౌలికవసతులు మెరుగుపరిచి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు వినియోగించాలని భావిస్తున్నాము,” అని ప్రధాని నరేంద్రమోడీ మాటల సారాంశం. 


Related Post