మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుమారు ఏడాదిగా బిజెపిలో చేరేందుకు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కానీ వివిద కారణాల చేత ఇంతవరకు చేరలేదు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధి కోసం వెతుకుతున్న బిజెపి ఇప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకొని బరిలో దింపబోతోందని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారని, త్వరలోనే బిజెపిలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సాగర్ ఉపఎన్నికల బరిలో దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే రాజగోపాల్ రెడ్డి ఆ ఊహాగానాలను ఖండించారు. మీడియాలో వస్తున్నవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకొంటానని అన్నారు. గతంలో బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపినమాట వాస్తవమే కానీ పార్టీ మారడంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు.