పార్టీ అధిష్టానంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తి

February 22, 2021


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తొలిసారిగా తమ పార్టీ అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ, “రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన రెండు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ నేటికీ రాష్ట్రంలో పార్టీ బలంగానే ఉంది.  పిసిసి అధ్యక్షుడి నియామకంలో పార్టీ అధిష్టానం తాత్సారం చేస్తుండటం వలననే పార్టీ నేతలలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక కొంతమంది నేతలు పార్టీని వీడుతున్నారు కూడా. అసలు నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు పిసిసి అధ్యక్షుడి నియామకానికి సంబంధం ఏమిటి? ఆ సాకుతో సాగదీస్తుండటం వలననే రాష్ట్రంలో పార్టీకి నష్టం కలుగుతోంది. వచ్చే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ అధిష్టానం తక్షణమే పిసిసి అధ్యక్షుడుని నియమించాలి. పార్టీలో సీనియర్లకు మాత్రమే ఆ బాధ్యత అప్పగించాలి. అప్పుడే రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. నాకు ఆ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీని వీడను,” అని అన్నారు.    

పిసిసి అధ్యక్ష పదవికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డిలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్టానం రేవంత్‌ రెడ్డివైపు మొగ్గు చూపుతున్నట్లు తెలియగానే పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్న సీనియర్లు నాగార్జునసాగర్ ఉపఎన్నికలు ముగిసేవరకు నిర్ణయాన్ని వాయిదా వేయాలని సూచించారు. కానీ ఈలోగా రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్రలతో హడావుడి చేస్తూ పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుండటంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈవిధంగా పార్టీ అధిష్టానంపై అసహనం వ్యక్తం చేసినట్లు భావించవచ్చు.     



Related Post