కాంగ్రెస్‌-మజ్లీస్‌ పార్టీలు ఎన్నికల పొత్తులు!

February 22, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో మజ్లీస్‌, టిఆర్ఎస్‌లు మిత్రపక్షాలుగా కొనసాగుతునందున వాటిని కాంగ్రెస్ పార్టీకి రాజకీయ శత్రువులుగా భావిస్తుంటుంది. అయితే త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మజ్లీస్‌తో పొత్తులకు సిద్దం అవుతుండటం విశేషం. ఈసారి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కనీసం 25 స్థానాలలో పోటీ చేయాలని భావిస్తున్న మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఇప్పటికే ఆ రాష్ట్రంలో పర్యటించి అక్కడి ప్రముఖ ముస్లిం నేత పిర్జాదా అబ్బాస్ సిద్ధిఖీతో చేతులు కలిపి ఆయన నేతృత్వంలో మజ్లీస్‌ పోటీ చేయబోతోందని ప్రకటించారు.

ఈ ఎన్నికలలో మళ్ళీ ఎలాగైనా గెలిచి అధికారం నిలుపుకోవాలని అధికార తృణమూల్ కాంగ్రెస్‌, ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపిలు చాలా పంతంగా ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌, వామపక్షాలు చేతులు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. వాటితో ఎన్నికల పొత్తులు పెట్టుకొని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో పాగా వేయాలని అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నట్లు తాజా సమాచారం.

ఈ నెల 25న ఆయన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌, వామపక్షాలతో పొత్తుల గురించి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా పోటీ చేస్తున్నందున అక్కడ మజ్లీస్‌ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు అసదుద్దీన్ ఓవైసీ ఆ రాష్ట్రంలో పోటీ చేయబోతున్న జిల్లాలలో పాదయాత్ర చేయబోతున్నట్లు సమాచారం. 


Related Post