చైనా ఒప్పుకొంది కానీ....

February 19, 2021


img

గత ఏడాది తూర్పు లద్దాక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత్‌ సైనికులపై చైనా  సైనికులు హటాత్తుగా అర్దరాత్రిపూట దాడి చేసి 20 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడు భారత్‌ సైనికులు కూడా వారిని ధీటుగానే ఎదుర్కొన్నారు. కానీ ఆ ఘర్షణలలో తమ సైనికులు ఎవరూ చనిపోలేదని వాదించిన చైనా ప్రభుత్వం ఇప్పుడు నిజం ఒప్పుకొంది. కానీ పూర్తిగా కాదు...పాక్షికంగానే! ఐదుగురు ఆర్మీ అధికారులు, కొందరు సైనికులు చనిపోయారని చైనా ప్రభుత్వం ఒప్పుకొంది. 

ఆ ఘర్షణలలో చనిపోయిన 20 మంది భారత్‌ జవాన్లకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి వారిని గౌరవించింది. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మహావీర్ చక్ర అవార్డు’ను ఇవ్వగా, తెలంగాణ ప్రభుత్వం తరపున సిఎం కేసీఆర్‌ ఆయన కుటుంబానికి రూ.5 కోట్లు ఆర్ధికసాయం, సంతోష్ బాబు భార్యకు ప్రభుత్వోద్యోగం, హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకొనేందుకు స్థలం అందజేసి సంతోష్ బాబు త్యాగాన్ని గౌరవించారు. ఈ ఘర్షణలలో చనిపోయిన మిగిలిన సైకుల కుటుంబాలకు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధికసాయం వగైరా అందజేసి గౌరవించాయి.    

కానీ చైనా ప్రభుత్వం మాత్రం ఘర్షణలలో తమ అధికారులు, సైనికులు చనిపోయారని ఒప్పుకోకపోవడంతో వారికి ఎటువంటి గుర్తింపు లభించలేదు. కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. చివరికి ఇన్ని నెలల తరువాత ఇప్పుడు నిజం ఒప్పుకొని చనిపోయిన ఐదుగురు ఆర్మీ అధికారుల పేర్లను...వారికి చైనాలో అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. కానీ ఎంతమంది సైనికులు చనిపోయారో... వారి వివరాలను చెప్పకుండా దాచిపెట్టింది. 

భారత్‌-చైనా సరిహద్దుల నుంచి ఇరుదేశాల సైన్యాల ఉపసంహరణ మొదలవడంతో భారత్‌ను ఢీకొనలేక చైనా తోక ముడిచిందని ప్రపంచదేశాలు ఆక్షేపిస్తాయనే సానుభూతి కోసం ఇప్పుడు ఈ విషయం బయటపెట్టి ఉండవచ్చు.


Related Post