నిరుద్యోగ భృతి ఇంకా ఎప్పుడు? ఉత్తమ్ ప్రశ్న

February 18, 2021


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాములు నాయక్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా పార్టీని గెలిపిస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటిస్తే, సిఎం కేసీఆర్‌ టిఆర్ఎస్‌ను గెలిపిస్తే  నెలకు రూ.3,016లు చొప్పున ఇస్తామని ప్రకటించారు. టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయ్యింది కానీ ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రెండునెలల క్రితం మంత్రి కేటీఆర్‌ రెండుమూడు రోజులలో సిఎం కేసీఆర్‌ స్వయంగా నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. కనుక నిరుద్యోగ భృతి ఇంకా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నేను సిఎం కేసీఆర్‌ను కోరుతున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడిస్తేనే సిఎం కేసీఆర్‌ ఆ ఎన్నికల హామీని అమలుచేస్తారు. అప్పుడే ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ కూడా ఇస్తారు. అప్పుడే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.97 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారు. టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా సమస్యలను పట్టించుకోకుండా తిరుగుతున్నారు. కనుక బడుగుబలహీనవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్ధి రాములు నాయక్‌ను గెలిపిస్తే, మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ప్రజాసమస్యలను పరిష్కరించగలరు,” అని అన్నారు.


Related Post