నాగార్జునసాగర్ ఉపఎన్నికలు అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారినందున ఆ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితులలో ఈ ఎన్నికలలో గెలిచితీరాలని చాలా పట్టుదలగా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ కె.జానారెడ్డిని అభ్యర్ధిగా బరిలో దించుతోంది. టిఆర్ఎస్ ఇంకా తన అభ్యర్ధిని ఖరారు చేయనప్పటికీ చాలా బలమైన అభ్యర్ధినే బరిలో దింపడం ఖాయం.
ఆ రెండు పార్టీలను ఢీకొని ఓడించగల అభ్యర్ధి కోసం వెతుకుతున్న బిజెపి కన్ను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పడినట్లు సమాచారం. ఆయన చాలాకాలంగా బిజెపిలో చేరడానికి ఎదురుచూస్తున్నారు. కనుక ఆయనను పార్టీలోకి తీసుకొని సాగర్ అభ్యర్ధిగా బరిలో దించాలని యోచిస్తున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ ఆయన ఇందుకు సిద్దపడితే కాంగ్రెస్, టిఆర్ఎస్‌లు చాలా గట్టిపోటీ ఎదుర్కోవలసివస్తుంది.
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో విజయం సాధించడంతో సమరోత్సాహంతో ఉన్న బిజెపి ఈ ఉపఎన్నికలలో కూడా గెలిచి తన సత్తా చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. తద్వారా దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో బిజెపి యాదృచ్ఛికంగా గెలవలేదని, రాష్ట్రంలో బిజెపికి ప్రజాధారణ పెరిగి బలపడింది కనుకనే గెలిచిందని, రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు బిజెపి మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాలని భావిస్తోంది. కనుక ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బిజెపి నుంచి గట్టి పోటీ అనివార్యం.
ఈ ఉపఎన్నికలు ఏ పార్టీ ఓడినా వాటిపై ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై చాలా ఎక్కువ ఉంటుంది కనుక ఈ ఉపఎన్నికలు వాటికి జీవన్మరణ సమస్య అనే చెప్పవచ్చు. మరి ఈ ముక్కోణపు పోటీలో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి.