కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టడం, నేడు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం, రావిరాలలో రణభేరీ బహిరంగసభ నిర్వహిస్తుండటంపై పార్టీలో నేతలే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలన్నీ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు దాని అధ్వర్యంలో జరగాలి. కానీ రేవంత్ రెడ్డి సొంతంగా పాదయాత్రలు, సభలు చేపడుతుండటంతో పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇది రైతుల, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకే తప్ప సొంత ఇమేజ్ పెంచుకొనేందుకు కాదని రేవంత్ రెడ్డి చెపుతున్నప్పటికీ, ఆయన సొంత ఇమేజ్ పెంచుకొనేందుకే ఇవన్నీ చేస్తున్నారని పార్టీలో కొందరు నేతలు వాదిస్తున్నారు.
అయితే పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో ప్రమేయం కూడా లేకుండా ఈవిదంగా ఒంటరిగా ముందుకు సాగుతుండటం సరికాదనే భావించవచ్చు. వీటితో ఆయన కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడగలరేమో కానీ రాష్ట్ర స్థాయిలో పార్టీ నేతలందరినీ దూరం చేసుకొంటున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పార్టీలో అనేకమంది రేవంత్ రెడ్డిని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. నెలరోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా దాదాపు ఖరారు చేసినప్పుడు పార్టీలో సీనియర్లందరూ కలిసి దానిని అడ్డుకొని నిలిపివేయడం అందరికీ తెలుసు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల తరువాత ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించినా పార్టీలో నేతలందరినీ దూరం చేసుకొన్నాక వారి సహకారం లేకుండా ఒంటరిగా ఆయన పార్టీని ఏవిదంగా నడిపించగలరు?కనుక రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టాలనుకోరుకొంటున్నట్లయితే ఈవిదంగా ఒంటరిగా పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో అందరినీ ఇంకా దూరం చేసుకొనేబదులు అందరికీ దగ్గరయ్యేందుకు గట్టిగా ప్రయత్నించడం మంచిది. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉన్నప్పుడు పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని...తద్వారా తమ రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకోవాలి కానీ ఇలా ఎవరికివారే అన్నట్లు ఎంత చమటోడ్చితే మాత్రం ఏం ప్రయోజనం? చివరికి ఏం సాధించగలరు?