మేయర్ విజయలక్ష్మితో వివాదం నిజమే కానీ..

February 16, 2021


img

బంజారాహిల్స్ కార్పొరేటర్ జి.విజయలక్ష్మి హైదరాబాద్‌ మేయర్‌గా ఎన్నికైన మర్నాడే గతంలో ఆమెతో గొడవపడిన షేక్‌పేట తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను సీసీఎల్ఏకు రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

విశాఖకు వెళ్ళి సోమవారం హైదరాబాద్‌ తిరిగివచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వోద్యోగులకు బదిలీలు సర్వసాధారణమైన విషయమే. అయితే హటాత్తుగా నన్ను ఎందుకు బదిలీ చేశారో తెలీదు. బదిలీ ఉత్తర్వులు ఇంకా నా చేతికి ఇవ్వలేదు. గత నెల 20వ తేదీన కార్పొరేటర్ విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి నా కార్యాలయానికి వచ్చినప్పుడు ఆదాయ దృవీకరణ పత్రం జారీచేసే విషయంలో ఆమెతో వివాదం తలెత్తినమాట వాస్తవం. ఆరోజు నేను కోర్టు పనిమీద వెళుతుండగా వారు నాతో గొడవపడ్డారు. కానీ నేను వారితో దురుసుగా వ్యవహరించానని పేర్కొంటూ వారు నాపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తరువాతే వారు నా విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కౌంటర్ పిటిషన్‌ వేశాను,” అని చెప్పారు. 

శ్రీనివాస్ రెడ్డి బదిలీ చేయడంపై ఉద్యోగ సంఘాలు నిరసనలు తెలియజేశాయి. రాజకీయ ఒత్తిళ్ళతో ఉద్యోగులను బదిలీ చేసి వేధించడాన్ని వారు ఖండించారు. 

కానీ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, “దీనిని మేయర్‌కు ముడిపెట్టడం సరికాదు. నేనే స్వయంగా ఈవిషయాన్ని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆయనను బదిలీ చేశారు,” అని చెప్పారు. అంటే ఉద్యోగులు వాదిస్తున్నట్లు రాజకీయ ఒత్తిళ్లతోనే శ్రీనివాస్ రెడ్డిపై బదిలీ వేటు పడిందని స్పష్టమవుతోంది. 


Related Post