జానారెడ్డిని తక్కువగా అంచనావేస్తే అంతేమరి!

February 15, 2021


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డి ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. చాలా ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్‌ పార్టీకి, ప్రభుత్వానికి సవాళ్ళు విసురుతున్నారు. దీనికి రెండు బలమైన కారణాలున్నాయి. 1. ఆయన నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తుండటం. 2. ఇటీవల సిఎం కేసీఆర్‌ హాలియా సభలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం. సాగర్ పరిధిలో సభ పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించడమంటే జానారెడ్డిని కవ్వించడంగానే భావించవచ్చు. కనుక ఆయన ధీటుగా స్పందిస్తున్నారు. 

అయితే ఆ సభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ “మిషన్ భగీరధ ద్వారా జిల్లా అంతటికీ మంచినీళ్లు అందిస్తున్నామని, ఏడాదిన్నరలోగా 13 ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ఓట్లు అడగబోమని చెప్పడం...” జానారెడ్డికి తెలంగాణ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే అవకాశం కల్పించింది. 

“మిషన్ భగీరధ పూర్తిచేయకపోతే ఓట్లు అడగనని చెప్పి ఆ పనులు పూర్తిచేయకుండా ఆర్నెల్లు ముందుగానే ఎన్నికలు పెట్టించి సిఎం కేసీఆర్‌ అధికారం చేజిక్కించుకొన్నారు. నేటికీ మిషన్ భగీరధ పనులు పూర్తికాలేదు. ఇప్పుడు 13 ప్రాజెక్టులు పూర్తిచేయకపోతే ప్రజలను ఓట్లు అడగనని సిఎం కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది,” అని విమర్శలు గుప్పించారు. 

జానారెడ్డి విమర్శలపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి జానారెడ్డి ఇంట్లో మిషన్ భగీరధ నీళ్ళు సరఫరా అవుతున్నాయో లేదో చూసి రమ్మని అధికారులను ఆదేశిస్తే వారు హాలియా మండలంలోని అనుముల గ్రామంలో జానారెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ నల్లాలో మిషన్ భగీరధ నీళ్ళు వస్తున్నాయని తెలిపారు. 

ఈ వ్యవహారం సోషల్ మీడియాలోకి ఎక్కడంతో జానారెడ్డి మళ్ళీ స్పందిస్తూ, “అదిప్పుడు నా ఇల్లు కాదు. ముప్పై ఏళ్ల క్రితమే దానిని వేరెవరికి అమ్మేశాను. అయినా నా ఒక్కడి ఇంట్లో నీళ్ళు వస్తున్నాయో లేదో చూసే బదులు అధికారులు జిల్లాలో...నాగార్జునసాగర్‌లో...ఎన్నిచోట్ల నీళ్ళు వస్తున్నాయో చూస్తే బాగుండేది కదా? నేటికీ రాష్ట్రంలో చాలా జిల్లాలలో మిషన్ భగీరధ పనులే పూర్తికాలేదు. ఇక నల్లాలలో నీళ్ళు ఎలా వస్తాయి?దీనిపై నేను బహిరంగ చర్చకు సిద్దం... మంత్రి ఎర్రబెల్లి సిద్దమేనా?” అంటూ జానారెడ్డి సవాలు విసిరారు. కనుక ఇప్పుడు బంటి టిఆర్ఎస్‌ కోర్టులో ఉంది. మరి జానారెడ్డి సవాలుని ఎర్రబెల్లి స్వీకరిస్తారా? చూడాలి.


Related Post