పీఆర్సీ...ఉద్యోగాల భర్తీకి ఎన్నికల కోడ్ బ్రేక్

February 15, 2021


img

సుమారు మూడేళ్ళు నాన్చిన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వడానికి సిద్దమైంది. దానిపై ఉద్యోగసంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో పోలీస్, విద్యాశాఖతో సహా వివిద ప్రభుత్వ విభాగాలలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్దమైంది. కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. డిసెంబర్‌ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టిఆర్ఎస్‌ హామీ ఇచ్చింది. దానిని ఇంతవరకు అమలుచేయకపోవడంతో నిత్యం ప్రతిపక్షాల విమర్శలు, దెప్పిపొడుపులు భరించవలసివస్తోంది. త్వరలోనే సిఎం కేసీఆర్‌ నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారని మంత్రి కేటీఆర్‌ రెండు వారాల క్రితం చెప్పారు. ఇటీవల సిఎం కేసీఆర్‌ హల్దియాలో బహిరంగ సభ నిర్వహించారు కానీ నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీల గురించి మాట్లాడ లేదు కానీ ఎన్నికలు, రాజకీయాల గురించి మాట్లాడారు! 

ఆ మర్నాడే రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ ఎన్నికలు ముగిసేలోగానే నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావచ్చు. అవి ముగిసేలోగానే వరంగల్‌, ఖమ్మం, రాష్ట్రంలోని మరికొన్ని మునిసిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కనుక ఈ ఎన్నికలన్నీ పూర్తయ్యేవరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటూనే ఉంటుంది. 

కనుక ఎన్నికల కోడ్ ఉన్నంతవరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయడం కష్టమే. అలాగే పీఆర్సీపై తుదినిర్ణయం తీసుకొని అమలుచేయడం కష్టమే. అదేవిధంగా నిరుద్యోగ భృతిపై కూడా ఇప్పుడు ప్రకటన చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ ఎన్నికలన్నీ పూర్తయ్యేందుకు మరో నెలరోజులు పైనే పట్టవచ్చు కనుక అంతవరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఎదురుచూడక తప్పకపోవచ్చు. 



Related Post