ప్రభుత్వానికి అనుకూలం..వ్యతిరేకం కాదు: తమిళిసై

February 13, 2021


img

తమిళినాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళసై సౌందరరాజన్‌ తెలంగాణ గవర్నర్‌గా నియమితులైనప్పుడు, రాష్ట్రంలో బిజెపి బలపడేందుకే ఆమెను నియమించారని, ఆమె టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ముప్పలు తిప్పలు పెట్టడం ఖాయమని చాలామంది భావించారు. కానీ ఆమె సిఎం కేసీఆర్‌తో, రాష్ట్ర ప్రభుత్వంతో చాలా హుందాగా వ్యవహరిస్తూ ఏడాది పూర్తి చేసుకొన్నారు. 

ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను ఓ రాజకీయపార్టీకి అధ్యక్షురాలిగా పనిచేసి గవర్నర్‌గా వచ్చినప్పటికీ ఇక్కడ రాజకీయాలు చేయదలచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో నాకు ఎటువంటి శతృత్వం లేదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెపితే దానిని గుడ్డిగా నమ్మను కూడా. ఆయా అంశాలను బట్టి ప్రభుత్వంతో ఏవిధంగా వ్యవహరించాలో నిర్ణయించుకొంటాను. నేను నిర్మాణాత్మకంగా పనిచేయాలనుకొంటాను తప్ప వివాదాస్పదంగా కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సత్సంబంధాలున్నాయి. 

తెలంగాణకు గవర్నర్‌గా వచ్చినకొత్తలో నా రాజకీయ నేపధ్యం కారణంగా ప్రభుత్వానికి నాపై కొన్ని సందేహాలు, అపోహలు ఉండటం సహజం. కానీ ఇప్పుడు రాజ్‌భవన్‌-రాష్ట్ర ప్రభుత్వం మద్య చక్కటి సయోధ్య ఉంది. వివిద సమస్యల గురించి మా సూచనలను, సలహాలను ప్రభుత్వం చక్కగా అమలుచేస్తోంది. నా దృష్టికి వచ్చిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వాటి పరిష్కారం కోసం రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్ ఏర్పాటు చేసాను. కరోనా సమయంలో నగరంలో ఆసుపత్రులలో పర్యటించి స్వయంగా పరిస్థితులు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు చేశాను. అలాగే నా సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు త్వరలో వైస్‌-ఛాన్సిలర్లను నియమించబోతోంది. 

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తాను. మారుమూల ప్రాంతాలలో నివశిస్తున్న గిరిజనులకు రోజూ ఆహారం అందించేందుకు ‘గవర్నర్‌ అన్నం’ పధకాన్ని ప్రారంభించబోతున్నాను. గవర్నర్‌ విచక్షణానిధి నుంచి దీనికి నిధులు కేటాయిస్తాను. రెండు వ్యాన్లు, 25 ఎలెక్ట్రిక్ స్కూటర్లతో ప్రతీరోజు 100-150 మంది గిరిజనులకు ఆహారం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. పోడు వ్యవసాయంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా తెలుసుకొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను.    

రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాలనుకొంటున్నాను. దీని కోసం త్వరలోనే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించాలనుకొంటున్నాను,” అని చెప్పారు.


Related Post