కాంగ్రెస్‌, బిజెపి నేతలూ...హద్దుమీరి మాట్లాడొద్దు: కేటీఆర్‌

February 12, 2021


img

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపి నేతలను ఈరోజు మరోసారి గట్టిగా హెచ్చరించారు. ఇవాళ్ళ  సిరిసిల్లా జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ, “ఇరవై ఏళ్ళ క్రితం టిఆర్ఎస్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటివరకు అనేకానేక ఎన్నికలలో మనం గెలుస్తున్నాము. కానీ ఏనాడూ కాంగ్రెస్‌, బిజెపి నేతల్లాగా మనం మిడిసిపడలేదు. బిజెపి నేతలు నోటికి వచ్చినట్లు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ని దూషిస్తున్నారు. మన ప్రభుత్వాన్ని, పార్టీపై నిత్యం అసత్య ఆరోపణలు చేస్తూ బురదజల్లుతున్నారు. ఒకటి రెండు ఎన్నికలలో గెలిస్తేనే వారికి ఇంత అహంకారం ప్రదర్శిస్తుంటే ఇన్నేళ్ళుగా ఇన్ని ఎన్నికలలో గెలుస్తూవచ్చిన మేమేంతలా ఉండాలి?కానీ ఎన్ని విజయాలు సాధిస్తున్నా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మనపని మనం చేసుకుపోతున్నాము. మన సహనాన్ని కాంగ్రెస్‌, బిజెపిలు చేతకానితనంగా భావిస్తే వారికి తగినవిధంగా బుద్ధి చెపుతాము. గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులనే ఉరికించాము. అవసరమైతే కేంద్రప్రభుత్వంతో కొట్లాడటానికి మనం వెనకాడలేదు. కాంగ్రెస్‌, బిజెపిలు మనకు ఓ లెక్కకాదు. కనుక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ మా సహనాన్ని పరీక్షించవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయినా కేంద్రప్రభుత్వం, కేంద్రమంత్రులు సిఎం కేసీఆర్‌ పనితీరును, పాలనను, రాష్ట్రలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను మెచ్చుకొంటుంటే రాష్ట్ర బిజెపి నేతలకు అవి ఎందుకు కనబడవు? కాంగ్రెస్‌ హయాంలో దేశంలో, రాష్ట్రంలో రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతూ వేలాదిమంది రైతుల ఉసురు పోసుకొంది. వారి ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులను మేము చేసి చూపిస్తుంటే మెచ్చుకోవలసిందిపోయి మాపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు, ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఇకనైనా కాంగ్రెస్‌, బిజెపి నేతలు తమ తీరు మార్చుకుంటే మంచిది లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని గుర్తుంచుకొంటే మంచిది,” అని తీవ్రంగా హెచ్చరించారు.


Related Post