తెలంగాణను వ్యతిరేకించి ఇప్పుడు ఉద్దరించడం దేనికి?

February 12, 2021


img

వైఎస్ షర్మిళ గురువారం ఖమ్మం జిల్లా వైసీపీ నేతలతో లోటస్ పాండ్ నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఈనెల 21న ఖమ్మం జిల్లాలో షర్మిళ పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా ఖమ్మం చేరుకొంటారు. ముందుగా అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యి జిల్లా, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకొంటారు. ఖమ్మం జిల్లాలో తమ పోడు భూములను కాపాడుకోవడం కోసం పోరాడుతున్న గిరిజనులతో ఆమె సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకొంటారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటారు. ఖమ్మంలో ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు,” అని అన్నారు. 

రాష్ట్ర విభజన సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలో తన పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం         సమైక్యరాష్ట్రం అంటూ మాటమార్చడంతో ఆయనను, పార్టీని నమ్ముకొన్న కొండా సురేఖ వంటి అనేకమంది నేతలు, కార్యకర్తల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. పైగా ఆయనను నమ్ముకొని తెలంగాణ ఉద్యమాలకు దూరంగా ఉండిపోయినందుకు ప్రజల దృష్టిలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారు కూడా. 

రాష్ట్ర విభజన తరువాత కూడా జగన్ తన రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో వైసీపీనినిద్రావస్థలో ఉంచేశారు. దాంతో ఆయనను నమ్ముకొన్న వైసీపీ నేతలు, కార్యకర్తల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.  ఇప్పుడు...ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ హటాత్తుగా షర్మిళ ఊడిపడి ‘తెలంగాణలో ప్రజల కష్టాలను తీరుస్తా... రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ వచ్చారు! సొంత పార్టీ నేతలను, కార్యకర్తలనే పట్టించుకోనివారు తెలంగాణ ప్రజలను ఉద్దరిస్తామంటే నమ్మశక్యంగా ఉందా?తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం పని? అయినా సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో సాగుతున్నప్పుడు, ఏపీ నుంచి వచ్చిపడిన షర్మిళ అవసరం ఏమిటి? రాష్ట్రంలో ప్రజాధారణ, అధికారం రెండూ లేని ఆమె తెలంగాణ ప్రజల సమస్యలను ఏవిధంగా తీర్చగలరు? తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కోసం ఆమె అన్న ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో కొట్లాడగలరా? అని ఆలోచిస్తే తెలంగాణలో ఆమె రాజకీయప్రవేశంపై అనేక సందేహాలు కలుగకమానవు. 

కనుక ఇప్పుడు కూడా ఆమె ఏదో ఓ రాజకీయ వ్యూహం, ప్రయోజనం, అవసరం లేనిదే వచ్చారంటే నమ్మలేము. ఇంత జరిగినా మళ్ళీ తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆమె వెనుక పరుగులు పెడుతుండటం చాలా ఆశ్చర్యకరమే.


Related Post