కోటిమందిలో కొందరికే అవకాశం..సద్వినియోగం చేసుకోండి: కేసీఆర్‌

February 12, 2021


img

నూతనంగా ఎన్నికైన హైదరాబాద్‌ మేయర్ జి.విజయలక్ష్మి, డెప్యూటీ మేయర్ ఎం.శ్రీలత, టిఆర్ఎస్‌ కార్పొరేటర్లు నిన్న ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కోటిమందిలో కొందరికే ఇటువంటి గొప్ప అవకాశం లభిస్తుంది. కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మీ పనితీరు, మాటలు, చేతలు, వ్యవహారశైలి అన్నీ పార్టీకి, ప్రభుత్వానికి పేరుతెచ్చేలా ఉండాలి. కొత్తగా వచ్చిన ఈ పదవులతో అహంకారం, డాబు, దర్పం ప్రదర్శించకుండా గతంలో ఎలా ఉన్నారో అలాగే నిరాడంబరంగా, హుందాగా ఉండాలి. అనవసరమైన మాటలు మాట్లాడి మీరు సమస్యలలో చిక్కుకోవద్దు...ప్రభుత్వానికి సమస్యలను సృష్టించవద్దు. మిమ్మల్ని ఎన్నుకొన్న ప్రజలతో స్నేహభావంతో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.

హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలు స్థిరపడ్డారు. కనుక ఇది ఒక మినీ భారతదేశం వంటిదే. కులమతాలు, ప్రాంతాలు, బాష తారతమ్యాలు చూపకుండా అందరినీ కలుపుకుపోతూ హైదరాబాద్‌ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాలి. మేయర్‌, డెప్యూటీ మేయర్లతో సహా అందరూ బస్తీలలో పర్యటిస్తూ అక్కడి పేదల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నించాలి. ప్రజలతో నిజాయితీ వ్యవహరించండి. ఒకసారి ఏదైనా మాట ఇస్తే దానిని నెరవేర్చేవరకు గట్టిగా కృషి చేయాలి. హైదరాబాద్‌ అభివృద్ధిలో మీలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి.

ఇక్కడున్న మీలో చాలా మందికి మేయర్ పదవి చేపట్టడానికి అర్హులున్నారని నాకు తెలుసు. కానీ అందరికీ ఇవ్వలేము కనుక అందరూ ఇది అర్ధం చేసుకొని పరస్పరం సహకరించుకోవాలి...” అంటూ ఇంకా అనేక మంచి విషయాలు చెప్పి వారికి మార్గదర్శనం చేశారు.


Related Post