తెలంగాణలో ప్రవేశానికి ఖమ్మంను ఎంచుకొన్న షర్మిళ

February 11, 2021


img

తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకొన్న వైఎస్‌ షర్మిళ ఖమ్మం నుంచి తన ప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమె నిర్ణయంతో ఏపీ వైసీపీకి, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎటువంటి సంబందమూ లేదని చెపుతునప్పటికీ, లోటస్‌పాండ్‌ నుంచే ఆమె రాజకీయప్రకటన చేయడం, వైసీపీ నేతలతో ఆమె సమావేశం అవుతున్నా జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం చెప్పకపోవడం, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే, జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌ వచ్చి ఆమెతో సమావేశం కావడం, సాక్షి పత్రిక ఆమె గురించి రోజూ సానుకూలంగా న్యూస్ కవరేజ్ ఇస్తుండటం వంటివన్నీ గమనిస్తే జగన్‌ ప్రోత్సాహంతోనే షర్మిళ తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించినట్లు మెల్లమెల్లగా స్పష్టం అవుతోంది. ఈనెల 21న ఆమె ఖమ్మం జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నట్లు సాక్షి మీడియా పేర్కొంది. 

ఆమె అకస్మాత్తుగా ఎందుకు తెలంగాణ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారు? ఆమె వెనుక ఎవరెవరున్నారు?వంటి సందేహాలను పక్కనపెడితే ఆమె ఖమ్మం జిల్లానుంచి తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించడానికి కొన్ని బలమైన కారణాలు కనబడుతున్నాయి. 

టిఆర్ఎస్‌ ప్రభంజనంలో కూడా ఖమ్మం జిల్లాలో వైసీపీ తరపున పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పాయం వెంకటేశ్వరులు గెలవడం, ఏపీకి సరిహద్దు జిల్లాగా ఉన్నందున ఖమ్మంలో ఆంధ్రా ప్రభావం ఎక్కువగా ఉండటం, ఖమ్మంలో నేటికీ వైసీపీ అభిమానులు ఉండటం వంటి కొన్ని సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకొన్న షర్మిళ తన రాజకీయ ప్రస్థానానికి ఖమ్మం జిల్లాను తెలంగాణ ముఖద్వారంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ రాజకీయాలపై షర్మిళ ఎటువంటి ప్రభావం చూపబోతున్నారో రానున్న రోజులలో అందరూ చూడగలుగుతారు. వాటిని బట్టి ఆమె తెలంగాణ రాజకీయాలలో ఎందుకు ప్రవేశించారో అర్ధం చేసుకోవచ్చు.


Related Post