టిఆర్ఎస్‌-మజ్లీస్‌ బందం విడదీయలేనిది

February 11, 2021


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీలు పరస్పరం కత్తులు దూసుకొన్నప్పటికీ అది ఓటర్లను, బిజెపిని మభ్యపెట్టడానికి ఆడిన నాటకమే అని, వాటి బందం విడదీయలేనిదని ఈరోజు మేయర్‌, డెప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా నిరూపించాయి. మేయర్ ఎన్నికలో మజ్లీస్‌ మద్దతు ఇవ్వకపోయినా టిఆర్ఎస్‌ సొంతంగానే తన అభ్యర్ధులను గెలిపించుకోగలదు. అయినప్పటికీ మజ్లీస్‌ సభ్యులు టిఆర్ఎస్‌ అభ్యర్ధులు విజయలక్ష్మి, శ్రీలతలకు బేషరతుగా మద్దతు పలికారు. 

కనుక జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో దూరమైన టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీలు మళ్ళీ ఇప్పుడు చేతిలో చేయి వేసుకొని సాగిపోతాయని వేరే చెప్పక్కరలేదు. ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మళ్ళీ వాటి దోస్తీ-దుష్మనీలపై సెటైర్లు వేయవచ్చు. అయితే వాటి వలన ఇప్పుడు టిఆర్ఎస్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. ఎందుకంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి హిందూ సెంటిమెంటు రగిలించి ఓటర్లను ఆకట్టుకొంటే నష్టపోతామనే భయంతోనే టిఆర్ఎస్‌, మజ్లీస్‌కు తాత్కాలికంగా తలాక్ చెప్పింది. ఇప్పుడు జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో, నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో హిందూ సెంటిమెంట్ పెద్దగా పనిచేయకపోవచ్చు కనుక టిఆర్ఎస్‌-మజ్లీస్‌ దోస్తీపై ఎవరు ఎన్ని అనుకొన్నా వాటికి ఎటువంటి నష్టమూ ఉండదు.


Related Post