బిజెపిని పక్కనపెట్టి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

February 10, 2021


img

ఈరోజు నాగార్జునసాగర్ పరిధిలోని హాలియాలో జరిగిన బహిరంగసభలో సిఎం కేసీఆర్‌ తమ పార్టీకి నిత్యం సవాళ్ళు విసురుతున్న బిజెపిని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరగడం విశేషం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం వలననే బిజెపి బలపడిందనే విషయం గ్రహించిన సిఎం కేసీఆర్‌, మళ్ళీ ఈవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను పెంచాలనుకొంటున్నారా?అనే సందేహం కలుగుతుంది. తద్వారా టిఆర్ఎస్‌కు బిజెపియే ప్రత్యామ్నాయమనే ఆ పార్టీ నేతల వాదనలు అర్ధరహితమని ప్రజలు భావించేలా చేయాలనుకొంటున్నారేమో? 

సిఎం కేసీఆర్‌ తన ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి వివరించిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ వలననే తెలంగాణ అన్నివిధాలా నష్టపోయిందని, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడూ తమ పదవులు, అధికారం కోసమే వెంపర్లాడారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చిన్న ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. కనీసం తెలంగాణ ఉద్యమాలలో కూడా కాంగ్రెస్‌ నేతలు చిత్తశుద్ధితో పోరాడలేదని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలోచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని శాసనసభలో చెపితే, కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా నోరు మెదపలేదని, అందరూ తమ పదవుల గురించి ఆలోచించుకొని మౌనం వహించారే తప్ప తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలనుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ఎన్నివిధాలుగా నష్టపోయిందీ వివరించి కాంగ్రెస్ నేతల అలసత్వం, అసమర్దత, పదవీలాలసల కారణంగానే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని కనుక వారికి ఇప్పుడు తెలంగాణ అనే పదం ఉచ్చరించడానికి కూడా హక్కులేదని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

ఈ సభలో సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం యధాలాపంగా చేసినవికావని ఖచ్చితంగా చెప్పవచ్చు. బహుశః రాష్ట్రంలో బిజెపి స్థాయిని తగ్గించి చూపే ప్రయత్నంలో టిఆర్ఎస్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతూ బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారేమో?కనుక రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కొనేందుకు సిఎం కేసీఆర్‌ ఈ సరికొత్త వ్యూహాన్ని అమలుచేయబోతున్నారా?అంటే త్వరలో జరుగబోయే ఎన్నికలలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Related Post