వెన్నుపోటుపై చంద్రబాబునాయుడు తాజా వ్యాఖ్యలు

February 10, 2021


img

ఏపీ మాజీ సిఎం చంద్రబాబునాయుడు తన మావగారు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకొన్నారనే అపవాదు మూటగట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడటం విశేషం. 

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశించడంపై చంద్రబాబునాయుడు స్పందిస్తూ, “ఆనాడు జగనన్న వదిలిన బాణాన్ని నేను...‘ అంటూ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చిన షర్మిళ ఆ తరువాత మళ్ళీ ఎన్నడూ కనబడలేదు. తద్వారా అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. విశ్వసనీయత గురించి గొప్పగా మాట్లాడే జగన్ తెలంగాణ రాజకీయాలలో షర్మిళ ఎందుకు ప్రవేశిస్తున్నారో చెప్పాలి. 

ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో జగన్ చిన్నాన వైసీపీ వివేకానంద రెడ్డి తన నివాసంలోనే దారుణహత్యకు గురయితే సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని పట్టుబట్టిన ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు. వివేకానంద కుమార్తె స్వయంగా తండ్రి హత్యపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతుంటే జగన్ ఎందుకు అంగీకరించలేదు? ఆ కేసులో వివేకానందా కుమార్తెను, ఇప్పుడు తన సోదరి  షర్మిళను జగన్ వెన్నుపోటు పొడిచారు. సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేనివాడు తెలంగాణ ప్రజలకు ఏమి న్యాయం చేయగలడు?” అని ప్రశ్నించారు.


Related Post