షర్మిళ రాకతో ఎవరికి లాభం?

February 09, 2021


img

వైఎస్ షర్మిళ ఉరుము, మెరుపు లేని పిడుగులా హటాత్తుగా ఇవాళ్ళ తెలంగాణ రాజకీయ ప్రవేశానికి సిద్దంకావడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె తన సోదరుడు, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో విభేదించి రాజకీయాలలోకి వస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తుంటే, కాదు...కేవలం ప్రజాసేవే లక్ష్యంగా వస్తున్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. కానీ ఆలోచిస్తే ఇంతకంటే బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 

కాంగ్రెస్‌, బిజెపిలనే పట్టించుకోని రాష్ట్ర ప్రజలు ఆంద్రానుంచి ఊడిపడిన షర్మిళ తెలంగాణలో ‘రాజన్న రాజ్యం’ స్థాపిస్తానంటే పట్టించుకొంటారా?అంటే కాదనే అర్ధమవుతుంది. ఈ సంగతి ఆమెకు తెలియదనుకోలేము. కానీ తనను పట్టించుకొని తెలంగాణ ప్రజల కోసమే ఆమె వస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు. అయితే ఆమె ఎందుకు వస్తున్నారు?అనే ప్రశ్నకు ఆమె రాకతో ఏ పార్టీకి లాభం?దేనికి నష్టం కలుగుతుంది?అని ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. 

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బిజెపితో టిఆర్ఎస్‌ ఇబ్బందిపడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. హిందూ సెంటిమెంటుతో తెలంగాణలో బలపడుతున్న బిజెపిని నిలువరించాలంటే తెలంగాణ సెంటిమెంటే సరైన ఆయుధం. ఈవిషయం రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నిరూపితమైంది. 

ఆంద్రాకు చెందిన చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొన్నప్పుడు, వారి కూటమిని తెలంగాణ సెంటిమెంటుతో టిఆర్ఎస్‌ దెబ్బ తీసింది. ఆ ఎన్నికలలో చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాంగ్రెస్ పాలిట శాపంగా మారిందని వాదించే కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. ఒకవేళ టిడిపితో (చంద్రబాబునాయుడు)తో పొత్తులు పెట్టుకోకపోయుంటే ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మరిన్ని సీట్లు తప్పక వచ్చి ఉండేవని కాంగ్రెస్‌ నేతలే స్వయంగా చెప్పుకొన్నారు. అంటే తెలంగాణ రాజకీయాలలో ఆంధ్రా నాయకులు జోక్యం చేసుకొంటే తెలంగాణ సెంటిమెంట్ బలపడుతుందని దాంతో టిఆర్ఎస్‌ లాభపడుతుందని నిరూపితమైంది. 

కనుక ఇప్పుడు ఆంధ్రాకు చెందిన షర్మిళ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి టిఆర్ఎస్‌ను ఎంతగా టార్గెట్ చేస్తే అంతగా తెలంగాణ సెంటిమెంట్ పెరుగుతుంది...టిఆర్ఎస్‌ లాభపడుతుందని భావించవచ్చు. కనుక షర్మిళ రాకవెనుక టిఆర్ఎస్‌ హస్తం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో బిజెపిని...దాని హిందూ సెంటిమెంటును ఎదుర్కోవాలంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ బలపడాలి. అందుకు షర్మిళ సరైన వ్యక్తి అని భావించవచ్చు. 

ఆమె వలన తెలంగాణలో వైసీపీ ఏమాత్రం బలపడదు...దానికి కానీ ఆమె పెట్టబోయే కొత్త పార్టీకి గానీ ప్రజలు ఓట్లు వేయరు. కనుక ఆమె రాకతో వైసీపీకి లేదా కొత్త పార్టీకి ఏమాత్రం ప్రయోజనం ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఆమె ప్రవేశంతో టిఆర్ఎస్‌ మాత్రం నూటికి నూరుశాతం లాభపడుతుంది. ఈ వాదన నిజమా కాదా అనే విషయం రానున్న రోజులలో లేదా త్వరలో జరుగబోయే ఎన్నికలలోనే తేలిపోతుంది. కనుక షర్మిళ సడన్ ఎంట్రీ వెనుక రహస్యం బయటపడాలంటే అంతవరకు ఓపికపట్టక తప్పదు.


Related Post