షర్మిళను వారించాం కానీ వినలేదు: సజ్జల

February 09, 2021


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిళ ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో తమ లోటస్ పాండ్ నివాసం వద్ద అభిమానులతో సమావేశమయ్యి తాను  తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించబోతున్నట్లు చెప్పిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో మళ్ళీ కలకలం మొదలైంది. దీనిపై ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ స్పందించగా ఇప్పుడు ఏపీ వైసీపీ తరపున ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా స్పందించారు. 

విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మనం జోక్యం చేసుకోవడం, అక్కడ మనం పార్టీ పెట్టడం వలన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని కనుక అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయవద్దని మేము షర్మిళమ్మకు చాలా నచ్చజెప్పాము. దీని వలన తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలు పాడవుతాయని నచ్చజెప్పాము. అన్నాచెల్లెళ్ళ మద్య విభేధాలు తలెత్తడం వలననే ఈవిదంగా చేస్తున్నారని మీడియాలో వస్తున్న ఊహాగానాలను ప్రజలు కూడా నమ్మే పరిస్థితి కల్పించినట్లవుతుందని చెప్పాము. కానీ షర్మిళమ్మకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారు తప్ప అన్నగారితో విభేధించడం వలననో లేదా ఏదో రాజకీయ వ్యూహంలో భాగంగానో కాదు. కనుక ఇది రాజకీయంగా భిన్నమైన ఆలోచన, మార్గం ఎంచుకోవడమే తప్ప మరొకటిగా చూడరాదు. 

ఇక జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత షర్మిళమ్మను పక్కన పెట్టారని, ఆమెకు పదవి ఇవ్వలేదని ఆమె కోపంతో పార్టీ పెట్టేందుకు సిద్దం అవుతున్నారనడం కూడా సరికాదు. ఎందుకంటే వైయస్సార్ కుటుంబానికి అవసరానికి మించి అన్నీ ఉన్నాయి. కనుక వారికి పదవులు, అధికారాల కోసం ఆరాటపడవలసిన అవసరమే లేదు. వైయస్సార్ కుటుంబంలో అందరూ ఎప్పుడూ ప్రజలు, ప్రజాసేవ గురించే ఆలోచిస్తూ ఆవిధంగానే రాజకీయంగా ముందుకు సాగుతుంటారు తప్ప పదవులు, అధికారం ఆశించి రాజకీయాలు చేయరు. ఇప్పుడు షర్మిళమ్మ ఒక నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేస్తున్నారు కనుక ఇక మేము చేయగలిగేదేమీ లేదు ఆమెకు అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప,” అని అన్నారు.


Related Post