తెలంగాణలో రాజన్న రాజ్యం ఎందుకు లేదు? షర్మిళ ప్రశ్న

February 09, 2021


img

తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశించబోతున్న వైఎస్ షర్మిళ ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద  తమ అభిమానులను కలిశారు. షర్మిళ పిలుపుమేరకు ఈరోజు ఉదయం నుంచే వేలాదిమంది లోటస్ పాండ్ వద్దకు చేరుకొని బాజాబజంత్రీలతో చాలా హడావుడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుండి షర్మిళ వారికి అభివాదం చేశారు. 

ఈ సందర్భంగా ఆమె వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాజన్న మన మద్య నుంచి వెళ్ళిపోయి 8 సంవత్సరాలు అవుతున్నా నేటికీ మీ అభిమానం చెక్కుచెదరలేదు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. రాజన్న రాజ్యంలో రైతులు, నిరుపేదలు, విద్యార్దులు అన్ని వర్గాల ప్రజలు హాయిగా బ్రతికారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవని మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో లక్షలాదిమంది వైఎస్ అభిమానులున్నారు. వారందరూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం కోరుకొంటున్నారు. మన వల్లనే రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధ్యం. అందుకే నేడు మీ ముందుకు వచ్చాను. అయితే నేనిప్పుడు మాట్లాడేందుకు రాలేదు. మాతో కలిసి పనిచేసినవారితో ఆత్మీయసమావేశాలు నిర్వహించుకొని వారిద్వారా రాష్ట్రంలో పరిస్థితుల గురించి తెలుసుకొనేందుకు వచ్చాను. మీ అందరికీ చెప్పకుండా పార్టీ పెట్టబోనని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు. 

ఆ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లలో షర్మిళ ఫోటో తప్ప ఎక్కడా ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫోటో లేకపోవడం విశేషం. షర్మిళ ఇవాళ్ళ ఉమ్మడి నల్గొండ జిల్లా వైసీపీ నేతలతో మాట్లాడుతున్నారు. తరువాత వరుసగా మిగిలిన జిల్లాల నేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశాలు ముగిసిన తరువాత కొత్త పార్టీపై నిర్ణయం ప్రకటిస్తారు. ఆమె అనుచరులు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ వైసీపీ అనే పేరు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం.           

ఇంతకీ ఆమె ఇంత హటాత్తుగా తెలంగాణ రాజకీయాలలో ఎందుకు ప్రవేశిస్తున్నారు? ఆమె సోదరుడు జగన్‌తో విభేదిస్తే ఏపీలోనే పార్టీ పెట్టాలి కదా? కానీ తెలంగాణలో పెట్టాలని ఎందుకు అనుకొంటున్నారు?కనుక జగన్‌ ప్రోత్సాహంతోనే ఆమె తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారా? అనే ప్రశ్నలకు జవాబులు త్వరలోనే లభిస్తాయని ఆశిద్దాం.


Related Post